ICC T20I Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన తాజా పురుషుల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్ద సంచలనం నమోదైంది. పాకిస్థాన్‌కు చెందిన మిస్టరీ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అంతర్జాతీయ టీ20ల్లో నంబర్-1 బౌలర్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు.

రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం

గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నుంచి అబ్రార్ అహ్మద్ ఈ నంబర్-1 ర్యాంక్‌ను లాగేసుకున్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ పేలవమైన ప్రదర్శన కనబరచడంతో రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. దీంతో 736 రేటింగ్ పాయింట్లతో అబ్రార్ అహ్మద్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో రషీద్ ఖాన్‌ను అధిగమించి తొలిసారి వరల్డ్ నంబర్-1 గా నిలిచాడు. రషీద్ రెండో స్థానానికి పడిపోయాడు.

కావ్య మారన్ ఫ్రాంచైజీతో బంధం

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ విదేశీ లీగ్‌లలో కూడా జట్లను కొనుగోలు చేస్తూ ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన ప్రతిష్టాత్మక ది హండ్రెడ్ లీగ్‌లో ఆమె యాజమాన్యంలోని జట్టు తరఫున అబ్రార్ అహ్మద్ ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ వేదికలపైనే కాకుండా ఫ్రాంచైజీ లీగ్స్‌లోనూ కావ్య మారన్ విశ్వాసం ఉంచిన ఈ మిస్టరీ స్పిన్నర్, ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానాన్ని అందుకోవడం క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

పాకిస్థాన్ చరిత్రలో ఐదో బౌలర్

పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఐసీసీ పురుషుల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్న ఐదో బౌలర్‌గా అబ్రార్ అహ్మద్ రికార్డు సృష్టించాడు. గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న అబ్రార్, టీ20 వరల్డ్ కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు.

Next Story