ఉత్కంఠపోరులో చివరకు...

Kerala Cricket League(KCL): కేరళ క్రికెట్ లీగ్‌లో ఆదివారం జరిగిన ఒక మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు, ఏరీస్ కొల్లాం సెయిలర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. భారత స్టార్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో విజయం సాధించడానికి బలమైన పునాది వేయగా, చివరి బంతికి సిక్సర్ బాదిన ముహమ్మద్ ఆషిక్ కొచ్చి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొల్లాం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోరు చేసింది. విష్ణు వినోద్ (94), కెప్టెన్ సచిన్ బేబీ (91) పరుగులతో కొచ్చి బౌలర్లకు చుక్కలు చూపించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొచ్చి జట్టుకు ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ కేవలం 51 బంతుల్లోనే 121 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు.

చివరి ఓవర్‌లో ఉత్కంఠ

సంచలన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ఔటైన తర్వాత మ్యాచ్ ఊహించని మలుపు తిరిగింది. చివరి ఓవర్‌లో కొచ్చి విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. బౌలర్ షరీఫుద్దీన్ వేసిన తొలి రెండు బంతులను ముహమ్మద్ ఆషిక్ ఫోర్, సిక్సర్‌గా మలిచి ఒత్తిడిని తగ్గించాడు. మూడో బంతికి సింగిల్ తీయగా, నాలుగో బంతికి అల్ఫీ ఫ్రాన్సిస్ జాన్ రనౌట్ అయ్యాడు. ఐదో బంతికి పరుగులేమీ రాకపోవడంతో చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కీలక సమయంలో ఆషిక్ ఏ మాత్రం భయపడకుండా భారీ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ విజయంతో కొచ్చి జట్టు టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంజూ శాంసన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు ఎంపికైన భారత జట్టులో శాంసన్ కూడా ఉన్నందున, ఈ ఇన్నింగ్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story