సంచలనం!

Kiwi Star Mitchell: సుమారు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. జనవరి 11న న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులతో రాణించిన కోహ్లీ.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శనతో కోహ్లీని రెండో స్థానానికి నెట్టేశారు.

భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ సిరీస్‌లో కేవలం మూడు ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 352 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కైవసం చేసుకున్నారు. తద్వారా భారత్‌లో భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన తొలి న్యూజిలాండ్ జట్టుగా బ్లాక్ క్యాప్స్ చరిత్ర సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు.

ఒక మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మిచెల్ ఇప్పుడు మూడో స్థానంలో నిలిచారు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం (360), భారత్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ (360) మాత్రమే ఆయన కంటే ముందున్నారు.

సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో (ఇండోర్) విరాట్ కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులతో వీరోచితంగా పోరాడారు. అయితే, అదే మ్యాచ్‌లో మిచెల్ 131 బంతుల్లో 137 పరుగులతో కమాండింగ్ ఇన్నింగ్స్ ఆడి కోహ్లీ సెంచరీని వెలవెలబోయేలా చేశారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 130కి పైగా పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను గెలుచుకోవడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story