Kohli Celebrated Without Removing His Helmet: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం బుధవారం రాత్రి ఒక చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 'ఛేజ్‌మాస్టర్' విరాట్ కోహ్లీ తన తొమ్మిదో ఐపీఎల్ సెంచరీని నమోదు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. 19వ ఓవర్‌లో లాంగ్ ఆఫ్ వైపు సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నప్పుడు స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో హోరెత్తిపోయింది.

తగ్గిన జోరు.. పెరిగిన బాధ్యత:

గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా డకౌట్ (సున్నా పరుగులు) అయిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదగానే ఎంతో ఉద్వేగంగా సెలబ్రేట్ చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, కోహ్లీ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించారు. స్టేడియంలోని ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు లేచి నిలబడి చప్పట్లతో అభినందిస్తున్నా.. కోహ్లీ కేవలం బ్యాట్ పైకెత్తి అభివాదం చేశారు తప్ప, తన హెల్మెట్ తీయలేదు. ఆర్భాటాలకు పోకుండా వెంటనే తర్వాతి బంతిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు.

అసలు కారణం వెల్లడించిన కోహ్లీ:

మ్యాచ్ అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న సందర్భంగా తన నిరాడంబర వేడుకపై కోహ్లీ స్పందించారు. "నేను పెద్దగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణం.. జట్టుకు ప్రస్తుతం పాయింట్ల అవసరం ఎంత ఉందో నాకు తెలుసు. కేవలం వ్యక్తిగత స్కోరు కంటే జట్టును గెలిపించడమే నా లక్ష్యం. నేను క్రీజులో ఎక్కువ సమయం ఉంటే జట్టు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నాకు తెలుసు. అందుకే నా దృష్టంతా మ్యాచ్ ముగించడంపైనే ఉంది" అని కోహ్లీ వివరించారు.

గత రెండు మ్యాచ్‌ల్లో విఫలం కావడం తనను కొంత ఇబ్బంది పెట్టిందని, అందుకే ఈ ఇన్నింగ్స్‌ను జట్టు విజయం కోసం చివరి వరకు కొనసాగించాలని నిశ్చయించుకున్నట్లు ఆయన తెలిపారు. కోహ్లీ (సెంచరీ) కి తోడు జితేష్ శర్మ మెరుపులు తోడవడంతో ఆర్సీబీ 193 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించి, ప్లేఆఫ్స్ దిశగా బలమైన అడుగు వేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story