Kohli Mania: కోహ్లీ మేనియా.. విశాఖ వన్డే టికెట్లన్నీ సోల్డ్ ఔట్
విశాఖ వన్డే టికెట్లన్నీ సోల్డ్ ఔట్

Kohli Mania: భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ విశాఖలో జరగనుంది. ఈ క్రమంలో అక్కడ కోహ్లీ మేనియా కనిపించింది. మొదట్లో మందకొడిగా సాగిన టికెట్ల విక్రయాలు, విరాట్ కోహ్లీ వరుస సెంచరీల కారణంగా ఒక్కసారిగా ఊపందుకుని నిమిషాల్లో అమ్ముడయ్యాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 6న జరగనున్న మ్యాచ్ టికెట్ల విక్రయం నవంబర్ 28న ప్రారంభమైంది. ‘‘మొదట్లో అభిమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.
కానీ కోహ్లీ రాంచీ వేదికగా జరిగిన మొదటి వన్డేలో సూపర్ సెంచరీ (135) సాధించిన తర్వాత నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి" అని ఏసీఏ ప్రతినిథి తెలిపారు.
కోహ్లీపై భారీ అంచనాలు
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. వరల్డ్ కప్ 2027లో భాగం కావాలనే ఆశయంతో ఉన్న కోహ్లీ, విశాఖలో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నారు. విశాఖలో ఇప్పటివరకు కోహ్లీ ఏడు మ్యాచ్‌లు ఆడి, 97.83 యావరేజ్‌తో 587 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటికే రాంచీ, రాయ్‌పుర్‌లలో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్.. విశాఖ వన్డేలోనూ సెంచరీ బాది వరుసగా మూడు సెంచరీలు చేసిన ఘనతను మళ్లీ సాధించాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కోహ్లీ గతంలో 2018లోనే వెస్టిండీస్‌పై వరుసగా మూడు శతకాలు బాది, వన్డే ఫార్మాట్‌లో ఈ ఫీట్ సాధించిన 12వ బ్యాటర్‌గా నిలిచారు.

