కేఎస్ భరత్ గుడ్‌బై

KS Bharat: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ గురువారం (జూన్ 4, 2026న) సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశం తరఫున 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఈ 32 ఏళ్ల వైజాగ్ బౌయ్.. తన సుదీర్ఘ అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలికారు.
రషభ్ పంత్ ప్రమాదానికి గురైన సమయంలో భారత జట్టులోకి వచ్చిన కేఎస్ భరత్.. 2023లో ఆస్ట్రేలియాపై నాగ్‌పూర్‌లో టెస్ట్ అరంగేట్రం (డెబ్యూ) చేశారు. అలాగే 2024 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలో తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడారు. మొత్తం 7 టెస్టుల్లోని 12 ఇన్నింగ్స్‌ల్లో 20.09 యావరేజ్‌తో 221 పరుగులు చేశారు. వికెట్ కీపర్‌గా 19 మందిని అవుట్ చేయడంలో (క్యాచులు, స్టంపింగ్స్) కీలక పాత్ర పోషించారు.
దేశం తరఫున ఆడటం నా జీవితంలోనే అతిపెద్ద గౌరవం:
రిటైర్మెంట్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో భరత్ ఒక భావోద్వేగ లేఖను పంచుకున్నారు.
"గర్వంతో నిండిన హృదయంతో, కృతజ్ఞతా భావంతో నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా దేశం తరఫున ఆడటం నా జీవితంలోనే అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ భారత టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కోసం నేను పడ్డ ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది" అని భరత్ పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలుగా తన క్రికెట్ కల వెనుక నిలబడిన తన తల్లిదండ్రులు, సోదరికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీసీసీఐ (BCCI), ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA), కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, గ్రౌండ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.

