నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా

Left-arm spinner Vishal Jaiswal: విజయ్ హజారే ట్రోఫీ 2025–26లో భాగంగా ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్, ప్రపంచ మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్‌ను పడగొట్టి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో 61 బంతుల్లో 77 పరుగులు చేసి భీకర ఫామ్‌లో కనిపించినప్పటికీ, జైస్వాల్ వేసిన అద్భుతమైన బంతికి క్రీజు వెలుపలికి వచ్చి స్టంప్ అవుట్ అయ్యాడు.

కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి వికెట్ తీయడమే కాకుండా, మ్యాచ్ అనంతరం ఆ బంతిపై విరాట్ సంతకాన్ని కూడా జైస్వాల్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న విరాట్ భాయ్‌తో కలిసి మైదానాన్ని పంచుకోవడం, ఆయన వికెట్ తీయడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను" అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో విశాల్ జైస్వాల్ కేవలం కోహ్లీనే కాకుండా రిషబ్ పంత్, నితీష్ రాణా వంటి కీలక వికెట్లను కూడా తీసి 4/42 గణాంకాలతో అద్భుత ప్రదర్శన చేశాడు. జైస్వాల్ ధాటికి ఢిల్లీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, స్వల్ప లక్ష్యమైనప్పటికీ గుజరాత్ జట్టు 247 పరుగులకే ఆలౌట్ కావడంతో, ఢిల్లీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్రారంభంలోనే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య వికెట్ కోల్పోయిన కష్టాల్లో ఉన్న ఢిల్లీని కోహ్లీ ఆదుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఢిల్లీ జట్టుకు ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.

PolitEnt Media

PolitEnt Media

Next Story