Team India: కొత్త చరిత్రకు వేదికైన లార్డ్స్.. టీమిండియా హిస్టరీ క్రియేట్!
హిస్టరీ క్రియేట్!

Team India: లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ 270 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలవడం ఏ క్రీడాకారునికైనా ఒక గొప్ప మైలురాయి అని, ఈ యువ భారత జట్టు ప్రదర్శన దేశంలో మహిళా క్రికెట్ వృద్ధికి నిదర్శనమని బీసీసీఐ పేర్కొంది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టంగా నిలిచిందని, ఎంతో మంది యువతులకు స్ఫూర్తినిస్తుందని కొనియాడింది.
బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ, భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత గొప్ప క్షణమని పేర్కొన్నారు. లార్డ్స్‌లో విజయం సాధించడం చాలా ప్రత్యేకమని, ఈ మ్యాచ్‌లో జట్టు చూపిన ధైర్యం, క్రమశిక్షణ, నమ్మకం గర్వకారణమని చెప్పారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి మాజీ గౌరవ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షా చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఆటగాళ్లు, కోచ్‌లు మరియు సహాయక సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, ఈ చారిత్రాత్మక విజయం ఏళ్ల తరబడి మహిళా క్రికెట్‌పై పెట్టిన పెట్టుబడికి, చూపిన నమ్మకానికి ఫలితమని అన్నారు. మహిళా క్రికెటర్లకు మెరుగైన వసతులు, బలమైన దేశీయ నిర్మాణం, వృత్తిపరమైన మద్దతు అందించడం ద్వారా విజయం సాధించేలా బీసీసీఐ వాతావరణాన్ని కల్పించిందని చెప్పారు. ముఖ్యంగా జై షా నాయకత్వంలో తీసుకున్న వేతన సమానత్వం, దేశీయ మ్యాచ్ ఫీజు పెంపు, మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) వంటి నిర్ణయాలు భారత మహిళా క్రికెట్ రూపురేఖలను మార్చాయని ఆయన పేర్కొన్నారు.
ఈ అద్భుతమైన విజయం తరతరాల క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని, భారతదేశంలో మహిళా క్రికెట్ మరింత బలోపేతం కావడానికి తోడ్పడుతుందని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. విజేత జట్టులోని ప్రతి ఒక్కరికీ బోర్డు ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.

