Madhav Tiwari’s Magic: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సరికొత్త ఆల్‌రౌండర్ ఉద్భవించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన మాధవ్ తివారీ, తన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో జట్టును ప్లేఆఫ్ రేసులో నిలబెట్టాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లోనే 18 పరుగులు (రెండు ఫోర్లు, ఒక సిక్సర్) సాధించి, ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో తన కెరీర్‌లో తొలి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.

బ్యాటింగ్‌కు ముందు బౌలింగ్‌లోనూ తివారీ కీలక పాత్ర పోషించాడు. ప్రమాదకరంగా మారుతున్న పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (56) వికెట్‌తో పాటు, సెట్ అయిన బ్యాటర్ కూపర్ కానలీ (38) వికెట్‌ను కూడా పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చినప్పటికీ, సరైన సమయంలో కీలక వికెట్లు తీసి పంజాబ్ స్కోరును కట్టడి చేయడంలో విజయవంతమయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల మాధవ్ తివారీని ఢిల్లీ క్యాపిటల్స్ మెగా వేలంలో రూ. 40 లక్షలకు దక్కించుకుంది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ, అండర్-19, అండర్-23 విభాగాల్లో మరియు మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో భోపాల్ లెపార్డ్స్ తరపున ఆడి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఎంపీ టీ20 లీగ్ సెమీఫైనల్‌లో 31 బంతుల్లో 65 పరుగులు చేసిన మెరుపు ఇన్నింగ్స్ అతనికి మంచి గుర్తింపు తెచ్చింది.

తన్ను తాను "100 శాతం బ్యాటర్, 100 శాతం బౌలర్" అని అభివర్ణించుకునే తివారీ, తన ఎదుగుదలలో కోచింగ్ స్టాఫ్ పాత్రను కొనియాడాడు. ఇయాన్ బెల్ సూచనల ప్రకారం సహజమైన పవర్ హిట్టింగ్‌పై దృష్టి పెట్టానని, అలాగే మునాఫ్ పటేల్ పర్యవేక్షణలో బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నానని తెలిపాడు. ప్రాక్టీస్ సెషన్లలో నేర్చుకున్న అంశాలను మైదానంలో అమలు చేసి జట్టు విజయానికి తోడ్పడటం పట్ల ఈ యువ ఆల్‌రౌండర్ సంతోషం వ్యక్తం చేశాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story