Major Blow for Pakistan national cricket team: పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజం దూరం!
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజం దూరం!

Major Blow for Pakistan national cricket team: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమైన పాకిస్థాన్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఎడమ మోకాలి గాయం కారణంగా ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో నేటి నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారికంగా ధృవీకరించింది.
పిసిబి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, బాబర్ ఆజం ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం మెడికల్ టీమ్ అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. రెండో టెస్టు సమయానికి అతను కోలుకుంటాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. పీఎస్ఎల్ 11 ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ చేరుకున్న బాబర్, రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గానే పాల్గొన్నాడు. కానీ, గురువారం ఉదయం ఒక్కసారిగా నొప్పి రావడంతో స్కానింగ్ నిర్వహించగా గాయం బయటపడింది.
ఇటీవలే ముగిసిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 11)లో బాబర్ ఆజం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా పెషావర్ జల్మీని ఛాంపియన్‌గా నిలబెట్టడమే కాకుండా, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు (588) చేసిన ఆటగాడిగా నిలిచాడు. మార్నస్ లబుషేన్ నేతృత్వంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో జరిగిన ఫైనల్లో పెషావర్ జల్మీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఫామ్‌లో ఉన్న బాబర్ టెస్టు సిరీస్‌కు దూరం కావడం జట్టుకు పెద్ద లోటు.
మరోవైపు, పాకిస్థాన్ కెప్టెన్సీపై వస్తున్న వార్తలపై బాబర్ ఆజం స్పందించాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులో మళ్ళీ కెప్టెన్సీ చేపట్టే ఆలోచన తనకు ఉందని, కానీ ప్రస్తుతం తన దృష్టి కేవలం ఆటపైనే ఉందని తెలిపాడు. విమర్శలను పట్టించుకోకుండా తన సహజ సిద్ధమైన ఆటను ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు.
బాబర్ స్థానంలో మొదటి టెస్టులో అజాన్ అవైస్ లేదా అబ్దుల్లా ఫజల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. పాక్ కెప్టెన్ షాన్ మసూద్ ఈ కీలక మ్యాచ్‌లో జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాలి.

