Neeraj Chopra: ఆసియా క్రీడల ముందు భారత్‌కు భారీ షాక్.. గాయంతో నీరజ్ చోప్రా దూరం!
గాయంతో నీరజ్ చోప్రా దూరం!

Neeraj Chopra: ఆసియా క్రీడల ముంగిట భారత బృందానికి భారీ షాక్ తగిలింది. భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గాయపడ్డాడు. శిక్షణ సమయంలో అతడి చీలమండ లిగమెంట్‌కు గాయం కావడంతో.. ఈ సీజన్‌లో మిగిలిన పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఈ విషయాన్ని నీరజ్ చోప్రా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇటీవల లుసానె డైమండ్ లీగ్‌లో ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనగా 88.05 మీటర్ల దూరాన్ని నమోదు చేసిన తర్వాత.. శిక్షణలో చీలమండ లిగమెంట్‌కు గాయం అయినట్లు తెలిపాడు.
వైద్యులతో, తన టీమ్‌తో చర్చించిన అనంతరం.. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు నీరజ్ చెప్పాడు. తన ఆటలో మళ్లీ మంచి రిథమ్‌ను అందుకుంటున్న సమయంలో గాయం కావడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం తన పూర్తి దృష్టి గాయం నుంచి కోలుకోవడం, మరింత బలంగా తిరిగి రావడంపైనే ఉందని స్పష్టం చేశాడు.
ఈ గాయం కారణంగా సెప్టెంబర్ 5న బ్రసెల్స్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్ దూరం కానున్నాడు. అంతేకాదు.. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ అల్టిమేట్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా అతడు పాల్గొనడం లేదు.
ముఖ్యంగా సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా పాల్గొనకపోవడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. జావెలిన్ త్రోలో భారత్‌కు పతకం సాధించే ప్రధాన ఆశాకిరణంగా ఉన్న నీరజ్ లేకపోవడం భారత అభిమానులకు నిరాశ కలిగించే విషయమే.
అయితే గతంలోనూ గాయాల నుంచి కోలుకుని అద్భుతంగా పునరాగమనం చేసిన నీరజ్.. ఈసారి కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వచ్చి తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం పోటీల కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్న నీరజ్.. పూర్తిగా కోలుకున్న తర్వాత మరింత బలంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. మరి భారత స్టార్ జావెలిన్ త్రోయర్ ఎప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తాడో చూడాలి.

