Ajit Agarkar: భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ (BCCI) ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పదవీకాలం మరికొన్ని వారాల్లో ముగియనుండటంతో ఈ మార్పు జరగవచ్చని తెలుస్తోంది.

అగార్కర్ తన పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఎన్డీటీవీ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై బీసీసీఐ, అగార్కర్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్లు సమాచారం. మాజీ భారత ఫాస్ట్ బౌలర్ అయిన అగార్కర్ పదవి నుంచి తప్పుకునే విషయంపై రానున్న రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంతకుముందు కూడా అగార్కర్ పదవీకాలం దాదాపు ముగిసినట్లేనని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. త్వరలో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన సమయంలోనే ఆయన చివరి సెలక్షన్ సమావేశానికి అధ్యక్షత వహించినట్లు సమాచారం.

అగార్కర్ స్థానంలో మాజీ భారత క్రికెటర్ పార్థివ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే నెలలో అగార్కర్ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో పార్థివ్ పటేల్‌ను నియమించే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story