కొత్త టీ20 సిరీస్‌లతో బిజీబిజీగా టీమ్ ఇండియా!

India national cricket team Schedule: భారత క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. 2026 క్యాలెండర్‌లో టీమ్ ఇండియా మరిన్ని కొత్త టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేలు ఆడిన తర్వాత, జూలైలో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ వెళ్లాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇంగ్లాండ్ వెళ్లే ముందు ఐర్లాండ్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడేలా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా, గతేడాది నవంబర్‌లో వచ్చిన 'దిత్వా' తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీలంకకు సహాయం చేసేందుకు గానూ, ఆ దేశ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు మూడు అదనపు టీ20లు ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది.

మరోవైపు సెప్టెంబర్ నెలలో భారత జట్టుకు అసలైన సవాల్ ఎదురుకానుంది. ఒకే సమయంలో వేర్వేరు చోట్ల మ్యాచ్‌లు ఆడే పరిస్థితి కనిపిస్తోంది. వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉండగా, అదే సమయంలో యూఏఈలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20ల సిరీస్ కూడా ఉంది. వీటన్నింటికీ తోడు సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 3 వరకు జపాన్‌లోని నాగోయాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న భారత్, ఈ టోర్నీ కోసం ఒక ప్రత్యేక జట్టును పంపే అవకాశం ఉంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలోనే జింబాబ్వేతో కూడా మూడు టీ20లు ఆడే అంశంపై చర్చలు సాగుతున్నాయి.

ఇన్ని మ్యాచ్‌లు పెరగడం భారత యువ క్రికెటర్లకు ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఇటీవల 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ సేన, ప్రస్తుతం 2027 వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టింది. దీనివల్ల శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే వంటి సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చే వీలుంటుంది. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య వంటి ప్రతిభావంతులు త్వరలోనే టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ యువ ఆటగాళ్లకు అత్యంత కీలకంగా మారనుంది. ఐపీఎల్‌లో తమ సత్తా చాటితే, జాతీయ జట్టు తలుపులు తట్టడం వీరికి సులభం అవుతుంది. ఐర్లాండ్ లేదా జింబాబ్వే పర్యటనల్లోనే వైభవ్ సూర్యవంశీ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ఛాన్స్ దక్కించుకోవచ్చు. మొత్తం మీద, ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులకు ఎడతెరిపి లేని వినోదాన్ని పంచడంతో పాటు, కొత్త నక్షత్రాలను వెలుగులోకి తీసుకురానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story