Malaysia Open: మలేషియా ఓపెన్: ప్రపంచ నంబర్ 1కు చుక్కలు చూపించిన ఆయుష్ శెట్టి!
ప్రపంచ నంబర్ 1కు చుక్కలు చూపించిన ఆయుష్ శెట్టి!

Malaysia Open: 20 ఏళ్ల మంగళూరు కుర్రాడు ఆయుష్ శెట్టి సరికొత్త చరిత్రకు చేరువగా వచ్చి తృటిలో తప్పించుకున్నాడు. గురువారం (జనవరి 8, 2026) జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి-క్వార్టర్ ఫైనల్స్‌లో ఆయుష్, చైనా దిగ్గజం షీ యుకీని ముప్పతిప్పలు పెట్టాడు. సుమారు 70 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ఆయుష్ 18-21, 21-18, 12-21 తేడాతో ఓటమి చెందాడు. ఈ టోర్నీ ఆరంభ రౌండ్‌లోనే ఆయుష్ సంచలనం సృష్టించాడు. స్థానిక ఫేవరెట్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ జి జియాను వరుస గేముల్లో (21-12, 21-17) ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే ప్రపంచ ఛాంపియన్ షీ యుకీని కూడా గడగడలాడించాడు. ఆయుష్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఒక దశలో 16-12తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ, షీ యుకీ తన అనుభవంతో పుంజుకుని 21-18తో గేమ్‌ను గెలుచుకున్నాడు. ఒత్తిడికి లోనుకాకుండా ఆయుష్ అద్భుతమైన నెట్ ప్లేను ప్రదర్శించాడు. 21-18తో ఈ గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు మళ్లించాడు. మూడో గేమ్‌లో ఆయుష్ స్వల్ప తప్పిదాలు చేయగా, షీ యుకీ తన అటాకింగ్ గేమ్‌తో 21-12తో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 6 అడుగుల 5 అంగుళాల పొడవుండే ఆయుష్‌ను క్రీడా పండితులు డెన్మార్క్ దిగ్గజం విక్టర్ అక్సెల్‌సన్‌తో పోలుస్తున్నారు. "ఈ ఏడాది చివరి నాటికి ఆయుష్ టాప్ 10 లేదా టాప్ 15 ర్యాంకింగ్స్‌లోకి చేరుకుంటాడు" అని అతని కోచ్ విమల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 32వ స్థానంలో ఉన్న ఆయుష్, ఈ టోర్నీలో చూపిన తెగువతో త్వరలోనే అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదుగుతాడని స్పష్టమవుతోంది.

