Mandhana vs Harmanpreet: మంధాన vs హర్మన్‌ప్రీత్..? నాయకత్వ మార్పు వేళ డ్రెస్సింగ్ రూమ్‌లో ముదురుతున్న విభేదాలు
ముదురుతున్న విభేదాలు

Mandhana vs Harmanpreet: భారత మహిళల క్రికెట్ జట్టులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టు పగ్గాలను స్మృతి మంధానకు అప్పగిస్తూ బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వన్డే, టీ20 జట్లు రెండింటికీ మంధానను కొత్త సారథిగా నియమించిన తత, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మంధానల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న దూరం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని టీమ్ వర్గాల సమాచారం.
విభేదాలకు అసలు కారణం ఏమిటి?
స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య సఖ్యత దెబ్బతినడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ వివాదమేనని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంధాన, తనకు భారత జట్టు నాయకత్వ బాధ్యతలు లభిస్తే ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అప్పటి నుంచే హర్మన్‌ప్రీత్, మంధానల మధ్య సంబంధాలు మునుపటిలా లేవని సమాచారం. ఇటీవల జరిగిన పరిణామాలతో ఈ విభేదాలు మరింత బహిర్గతమయ్యాయని ప్రచారం జరుగుతోంది.
హర్మన్‌ప్రీత్ ఫామ్‌పై ప్రశ్నలు.. మాజీల స్పందన
ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీతో పాటు ఆమె వ్యక్తిగత ఫామ్, ఫిట్‌నెస్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం ఘాటుగా స్పందించారు. రెండు మూడేళ్ల క్రితమే సెలక్టర్లు స్మృతి మంధానకు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో, గౌహతిలో జరిగిన బీసీసీఐ సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాల్సి వచ్చింది. దాంతో పూర్తి స్థాయి పగ్గాలు స్మృతి మంధాన చేతికి వచ్చాయి.
జట్టులో హర్మన్‌ప్రీత్ భవితవ్యం ఏమిటి?
కెప్టెన్సీ పోయిన తర్వాత ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ భవిష్యత్తుపై పెద్ద సందిగ్ధత నెలకొంది. కొంతకాలంగా ఆమె బ్యాటింగ్ ఫామ్ ఆశాజనకంగా లేదు. పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, జింబాబ్వేతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు ఆమెను జట్టులోకి ఎంపిక చేశారు. అయితే కేవలం సీనియారిటీ ఆధారంగా జట్టులో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే మ్యాచ్‌లలో ఆమె బ్యాట్ ఝుళిపించి తిరిగి ఫామ్‌ను నిరూపించుకోకపోతే, టీమ్ ఇండియాలో హర్మన్‌ప్రీత్ స్థానం ప్రమాదంలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

