Mayank Yadav: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ వికెట్ మెయిడిన్ వేసి జట్టును ఘన విజయం వైపు నడిపించాడు. 3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు తొలుత శుభారంభం లభించింది. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన మయాంక్ యాదవ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా విహాన్ మల్హోత్రా, ఉదయ్ సహారన్, అర్జున్ రాజ్‌పుత్‌ను ఔట్ చేశాడు. ఆఖర్లో సుఖ్‌దీప్ బజ్వాను కూడా ఔట్ చేసి నాలుగు వికెట్లు సాధించాడు.

మయాంక్‌తో పాటు దిగ్వేశ్ రాఠీ 3 వికెట్లు, నితీశ్ రాణా, సిమర్‌జీత్ సింగ్ కూడా రాణించడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 17.5 ఓవర్లలో 131 పరుగుల వద్దే ముగిసింది. పంజాబ్ తరఫున 33 పరుగులు చేసిన హర్ప్రీత్ బ్రార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ 109 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

అంతకుముందు ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య 32 బంతుల్లో 55 పరుగులు చేసి ఫిఫ్టీ సాధించగా, యశ్ ధుల్ 40 బంతుల్లో 78 పరుగులు చేసి అజేయ అర్థసెంచరీ నమోదు చేశాడు. నితీశ్ రానా, తేజస్వి దహియా, హిమ్మత్ సింగ్ కూడా రాణించారు.

మయాంక్ యాదవ్ ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌పై ఐదు వికెట్లు తీసిన తర్వాత రెండో మ్యాచ్‌లోనూ అదే ఫామ్ కొనసాగించాడు. ట్రిపుల్ వికెట్ మెయిడిన్ వంటి అరుదైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఢిల్లీ జట్టు వరుస విజయాలతో టోర్నీలో ముందుంది.

యువ పేసర్ మయాంక్ యాదవ్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆయన బౌలింగ్ ప్రదర్శనలు టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించనున్నాయి. ఢిల్లీ జట్టు ఈ విజయంతో గ్రూప్‌లో బలమైన స్థానంలో నిలిచింది.

Next Story