Messi Event Controversy: మెస్సీ ఈవెంట్ వివాదం..రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేసిన గంగూలీ
రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేసిన గంగూలీ

Messi Event Controversy: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతాకు చెందిన 'అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్' ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహాపై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇటీవల (డిసెంబర్ 13, 2025) ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిర్వాహకుల వైఫల్యం, విపరీతమైన విఐపి సంస్కృతి వల్ల సామాన్య అభిమానులు మెస్సీని సరిగ్గా చూడలేకపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు స్టేడియంలో విధ్వంసం సృష్టించారు.
ఈ క్రమంలో అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఒక ఇంటర్వ్యూలో గంగూలీపై సంచలన ఆరోపణలు చేశారు.ఈ కార్యక్రమ నిర్వాహకుడు శతద్రు దత్తాకు గంగూలీ 'మిడిల్ మ్యాన్' (మధ్యవర్తి) గా వ్యవహరించారని ఆరోపించారు.గంగూలీ బెంగాల్ క్రికెట్‌ను నాశనం చేశారని, కేవలం డబ్బు కోసమే ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారని విమర్శించారు.
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేసినందుకు గాను గంగూలీ కోల్‌కతాలోని లాల్‌బజార్ సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు ఉత్తమ్ సాహా రూ. 50 కోట్లు పరిహారంగా చెల్లించాలని, అలాగే తక్షణమే క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులు పంపారు. తాను ఆ కార్యక్రమానికి కేవలం ఒక అతిథిగా మాత్రమే వెళ్లానని, దాని నిర్వహణతో తనకు ఎలాంటి సంబంధం లేదని గంగూలీ స్పష్టం చేశారు. స్టేడియంలో గందరగోళం మొదలైన వెంటనే తాను అక్కడి నుండి వచ్చేసినట్లు తెలిపారు.

