Messi Expresses Optimism: మెస్సీ ఆశాభావం: భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు!
భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు!

Messi Expresses Optimism: ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి భారత్‌లో ఫుట్‌బాల్ ఆటకు మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన ఇటీవలి భారత పర్యటనలో లభించిన అద్భుతమైన ఆతిథ్యానికి, అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. మూడు రోజుల పాటు దేశంలో పర్యటించిన మెస్సి... కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో అభిమానులతో ముచ్చటించాడు. యువ ఆటగాళ్లతో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు.
పర్యటన ముగింపులో అనంత్ అంబానీ స్థాపించిన జామ్‌నగర్‌లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించాడు. ఈ కార్యక్రమంలో మెస్సితో పాటు అతని స్నేహితులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా పాల్గొన్నారు. భారత్ నుంచి బయలుదేరే ముందు మెస్సి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పర్యటనకు సంబంధించిన ఒక అందమైన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోకు అభిమానుల నుంచి లక్షలాది లైక్‌లు, కామెంట్లు వర్షం కురిసాయి.
‘ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాలో జరిగిన పర్యటనలు అద్భుతంగా సాగాయి. అద్భుతమైన ఆతిథ్యం, హృదయపూర్వక స్వాగతం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు చూపిన అపార ప్రేమకు కృతజ్ఞతలు. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను’ అని మెస్సి తన పోస్ట్‌లో రాశాడు.
ఈ పర్యటన ద్వారా భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానుల సంఖ్య ఎంత భారీగా ఉందో మరోసారి తేటతెల్లమైంది. మెస్సి రాకతో దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఉత్సాహం మరింత పెరిగింది. ఈ దిగ్గజం ఆశీర్వాదంతో భారత ఫుట్‌బాల్ కొత్త ఎత్తులకు ఎదగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

