T20 World Cup: క్రికెట్ చరిత్రలో మైలురాయి..500 మిలియన్ల వ్యూస్ తో టీ20 వరల్డ్ కప్ రికార్డ్
500 మిలియన్ల వ్యూస్ తో టీ20 వరల్డ్ కప్ రికార్డ్

T20 World Cup: 2026 టీ20 ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా భారత్‌లో వ్యూవర్‌షిప్ రికార్డులు తిరగరాయడం క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పింది. ఇండియాలో 500 మిలియన్ల (50 కోట్లు) మందికి పైగా ప్రేక్షకులు ఈ టోర్నీని వీక్షించడం ఒక భారీ రికార్డ్ అని ఐసీసీ ఛైర్మన్ జైషా ప్రకటించారు. ఇవాళ్టి నుంచి జరిగే సెమీస్ మ్యాచ్‌లు మరిన్ని రికార్డులు బద్దలు కొడతాయని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, టెలివిజన్ రెండింటిలోనూ గణనీయమైన వృద్ధి కనిపించింది. క్రికెట్‌ను కేవలం కొన్ని దేశాలకే పరిమితం చేయకుండా, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఐసీసీ లక్ష్యం ఈ వరల్డ్ కప్ ద్వారా నెరవేరినట్లు కనిపిస్తోంది. భారీ స్థాయిలో వీక్షకులు ఉండటంతో స్పాన్సర్‌షిప్, ప్రకటనల ద్వారా ఐసీసీకి భారీగా ఆదాయం సమకూరింది. జై షా నేతృత్వంలో ఐసీసీ, క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం , అమెరికా వంటి కొత్త మార్కెట్లలో విస్తరించడంపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. 500 మిలియన్ల వ్యూవర్‌షిప్ అనేది భవిష్యత్తులో వచ్చే టోర్నీలకు (ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్) ఒక బలమైన పునాదిగా మారుతుంది.
ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికా వర్సెస్ -న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్..రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ -ఇంగ్లండ్ సెమీ ఫైనల్స్ 2లో పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లలో గెలిచిన టీమ్స్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 8 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

