Mirabai Chanu: రీఎంట్రీలో మీరాబాయి అదుర్స్... కామన్ వెల్త్ లో గోల్డ్ మెడల్
కామన్ వెల్త్ లో గోల్డ్ మెడల్

Mirabai Chanu: పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన తర్వాత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానూ రీఎంట్రీలో సత్తాచాటింది. 2025 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో ఆమె రికార్డులను కూడా బద్దలు కొట్టారు. మీరాబాయి చానూ మొత్తం 193 కిలోల బరువు (స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలు) ఎత్తి కొత్త కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ రికార్డులను నెలకొల్పారు.
అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య తన నిబంధనలను మార్చడంతో, మీరాబాయి తన పాత 49 కేజీల విభాగం నుండి 48 కేజీల విభాగానికి మారారు. ఈ విభాగంలో ఆమె పోటీపడటం చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి. ఈ స్వర్ణ పతకం గెలుచుకోవడం ద్వారా మీరాబాయి 2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆమె పాల్గొన్న మొదటి పోటీ ఇదే. ఈ విజయం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, తన తదుపరి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు మంచి సన్నాహంగా ఉపయోగపడుతుంది.
చానూ విజయాలు
2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా మీరాబాయి చానూ అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ క్రీడల్లో ఆమె 48 కేజీల విభాగంలో పోటీపడి, మూడు కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను నెలకొల్పారు.2020 టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచి దేశానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. మీరాబాయి చానూ బర్మింగ్‌హామ్‌లో జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 49 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ పోటీల్లో ఆమె మొత్తం 201 కేజీల బరువును ఎత్తి రికార్డు సృష్టించారు.
