పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు తిరస్కరణ!

Mohammad Rizwan Sensation: పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఫర్ చేసిన సెంట్రల్ కాంట్రాక్టుపై సంతకం చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. తాను అడిగిన కొన్ని ముఖ్య డిమాండ్లు నెరవేరకపోవడం వల్లే రిజ్వాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం మార్చి నుంచి తాను టీ20 అంతర్జాతీయ జట్టుకు ఎందుకు దూరమయ్యానో పీసీబీ నుంచి ఖచ్చితమైన వివరణ కావాలని రిజ్వాన్ కోరుతున్నట్లు సమాచారం. తనను జట్టు నుంచి తొలగించడానికి గల కారణాలను బోర్డు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారట. రిజ్వాన్ కొన్ని అదనపు డిమాండ్లను కూడా బోర్డు ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ఆ డిమాండ్లకు పీసీబీ ఇంకా అంగీకరించకపోవడంతో, ఆటగాడికి, బోర్డుకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో రిజ్వాన్‌, బాబర్ ఆజమ్‌ వంటి సీనియర్ ఆటగాళ్లను గతంలో ఉన్న 'కేటగిరీ-ఎ' నుంచి 'కేటగిరీ-బికి దించిన సంగతి తెలిసిందే. ఇటీవల రిజ్వాన్‌ను వన్డే కెప్టెన్ పదవి నుంచి కూడా తొలగించారు. ఆయన స్థానంలో షాహీన్ షా అఫ్రిదిని నియమించారు. సెంట్రల్ కాంట్రాక్టుపై సంతకం చేయని ఏకైక ఆటగాడు రిజ్వానే అని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంలో రిజ్వాన్ మరియు పీసీబీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story