విజ్డెన్ అవార్డ్

Mohammed Siraj: ప్రపంచ క్రికెట్ బైబిల్.. ‘విజ్డెన్ అల్మనాక్-2026’ అవార్డుల్లో భారత క్రికెటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ప్రకటించిన మొత్తం 9 అవార్డుల్లో.. ఏకంగా ఏడింటిని టీమిండియా స్టార్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించారు.
ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన ‘విజ్డెన్ ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్’ జాబితాలో నలుగురు భారతీయులే ఉండటం విశేషం.హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్, యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్, కం బ్యాక్ హీరో రిషబ్ పంత్,ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్ హసీబ్ హమీద్ మాత్రమే ఈ జాబితాలో నిలిచిన ఏకైక విదేశీ ప్లేయర్.
గతేడాది ఇంగ్లండ్ టూర్‌లో సిరాజ్ తన నిప్పులు చెరిగే బంతులతో 23 వికెట్లు తీసి ఇంగ్లిష్ జట్టును వణికించగా.. గిల్ 754 రన్స్‌తో పరుగుల వరద పారించాడు. గాయంతోనూ పోరాడి కీలక ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్, సమతూకం దెబ్బతినకుండా ఆడిన జడేజా.. టీమిండియా సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
టీ20ల్లో సునామీ సృష్టించిన అభిషేక్ శర్మను ‘మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వరించింది. 193 స్ట్రైక్ రేట్‌తో 859 రన్స్ చేసి అభిషేక్ సంచలనం సృష్టించాడు. అటు మహిళల విభాగంలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన దీప్తి శర్మ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో ఆమె పాత్ర వెలకట్టలేనిది.అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ మెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్‌గా ఎంపికయ్యారు. మొత్తానికి, విజ్డెన్ వేదికపై భారత్ జెండా రెపరెపలాడింది. భారత క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా గర్వకారణం!

