అభిమానులకు మరో వారం పాటు నిరీక్షణ తప్పదా?

MS Dhoni Injury Update: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోనీ పునరాగమనంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుండి పిక్క గాయం (Calf Injury) కారణంగా ధోనీ ఆటకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చెన్నై ఆడిన మూడు మ్యాచ్‌లకు కూడా ఆయన అందుబాటులో లేరు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ధోనీ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం ధోనీ చెన్నైలోనే ఉంటూ తన కుటుంబంతో సమయం గడుపుతున్నారు. సిఎస్‌కె సపోర్ట్ స్టాఫ్ పర్యవేక్షణలో ఆయన రిహాబిలిటేషన్ (పునరావాసం) పొందుతున్నారు. కొద్దిరోజుల క్రితం ధోనీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించినప్పటికీ, ఆయన ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదని సమాచారం. ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ధోనీ ఆడటం దాదాపు అసాధ్యమని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో వారం పడుతుందని జట్టు వర్గాలు ధృవీకరించాయి.

ఏప్రిల్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్‌కైనా ధోనీ అందుబాటులో ఉంటారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సిఎస్‌కె సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. "ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కోలుకుంటున్నారు, దీనికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేము" అని వెల్లడించారు. అలాగే సైడ్ స్ట్రెయిన్ గాయంతో బాధపడుతున్న మరో ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ కోలుకుంటున్నారని, తదుపరి మ్యాచ్ నాటికి అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోనీ గాయంపై స్పందించారు. "ధోనీ మెల్లగా కోలుకుంటున్నారు. గాయాలు తగ్గడానికి ఒక్కోసారి సమయం పడుతుంది. ఆయన సిద్ధంగా ఉంటే త్వరలోనే మైదానంలో కనిపిస్తారు" అని పేర్కొన్నారు. ధోనీ గైర్హాజరీలో చెన్నై జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడగా, అభిమానులు మాత్రం తమ 'తల'ను మైదానంలో చూడాలని ఆరాటపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏప్రిల్ మధ్యలో జరిగే మ్యాచ్‌ల నాటికే ధోనీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story