Amanjot Kaur: మా నానమ్మ ఆరోగ్యంగా ఉంది.. అదంతా అబద్ధమన్న అమన్‌జోత్ కౌర్
అదంతా అబద్ధమన్న అమన్‌జోత్ కౌర్

Amanjot Kaur: భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలవడంలో కీలకమైన క్యాచ్ పట్టి, లారా వోల్వార్ట్ వికెట్‌ను తీసిన అమన్‌జోత్ కౌర్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె అద్భుత ప్రదర్శన కంటే, ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన పుకార్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
తండ్రి భూపిందర్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్
అమన్‌జోత్ తండ్రి భూపిందర్ సింగ్, తన కుమార్తె క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఎమోషనల్ విషయాలు పంచుకున్నారు. అమన్‌జోత్ క్రికెట్ కెరీర్ వెనుక తన తల్లి భగవంతి మూలస్తంభంలా నిలబడిందని తెలిపారు. మొహాలీలోని వీధుల్లో, పార్కుల్లో మగపిల్లలతో అమన్‌జోత్ ఆడుతున్నప్పుడు ఆమెనే తీసుకెళ్లేవారని చెప్పారు.
వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే తన తల్లికి గుండెపోటు వచ్చిందని, అయితే ఆమె దృష్టి మరలకూడదని ఆ విషయాన్ని అమన్‌జోత్‌కు చెప్పలేదని భూపిందర్ సింగ్ గుర్తు చేసుకున్నారు.
అదంతా ఫేక్: అమన్‌జోత్ క్లారిటీ
తండ్రి చెప్పిన మాటలను సోషల్ మీడియాలో కొందరు వక్రీకరించి "అమన్‌జోత్ నానమ్మ చనిపోయిందని" తప్పుడు ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై అమన్‌జోత్ కౌర్ వెంటనే స్పందించింది. "మా నాన్నమ్మ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ఆమె ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు ఎలాంటి సమస్యా లేదు.* ఇలాంటి అవాస్తవాలు నమ్మొద్దు, ప్రచారం చేయొద్దు" అని అభిమానులను కోరారు.

