Nashra Sandhu: పాకిస్థాన్ స్టార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నష్రా సంధు టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించారు. సోమవారం సెప్టెంబర్ 7న దుబాయ్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ 2026 మ్యాచ్‌లో హాంకాంగ్, చైనాపై అద్భుతమైన బౌలింగ్‌తో సత్తా చాటారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషులు, మహిళలు కలిపి ఆరు వికెట్లు తీసిన తొలి పాకిస్థాన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు.

హాంకాంగ్, చైనాతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో నష్రా సంధు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టారు. రెండో ఓవర్లో ఒక వికెట్ తీసిన ఆమె.. మూడో ఓవర్లో మరో ఇద్దరు బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. ఇక నాలుగో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీసి హాంకాంగ్ బ్యాటింగ్‌ను పూర్తిగా దెబ్బతీశారు.

నష్రా అద్భుత బౌలింగ్ కారణంగా పాకిస్థాన్ 143 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. హాంకాంగ్, చైనా జట్టు 19 ఓవర్లలో కేవలం 71 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాకిస్థాన్ 72 పరుగుల భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్ సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.

నష్రా సంధు రాకముందు టీ20ల్లో పాకిస్థాన్ బౌలర్‌గా అత్యుత్తమ బౌలింగ్ రికార్డు స్పిన్నర్ సుఫియాన్ మొకీమ్ పేరిట ఉండేది. 2024 డిసెంబర్ 3న బులవాయోలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మొకీమ్ 2.3 ఓవర్లలో కేవలం మూడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టారు.

మహిళల టీ20ల్లో పాకిస్థాన్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ రికార్డు మాత్రం ఒమైమా సొహైల్ పేరిట ఉండేది. 2022 అక్టోబర్ 11న సిల్హెట్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆమె నాలుగు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నారు. ఇప్పుడు నష్రా సంధు ఆ రికార్డును కూడా అధిగమించారు.

నష్రా సంధు ఆరు వికెట్లు తీసిన ఘనతతో మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. టీ20 ఆసియా కప్‌లో పురుషులు, మహిళలు కలిపి ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో ఆమె కంటే ముందు శ్రీలంక స్టార్ క్రికెటర్ చమరి ఆటపట్టు మాత్రమే ఉన్నారు.

ప్రస్తుతం మహిళల ఆసియా కప్ 2026లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న చమరి ఆటపట్టు.. సెప్టెంబర్ 2న ఇండోనేషియాతో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో కేవలం 3.3 ఓవర్లలో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. ఇప్పుడు నష్రా సంధు కూడా ఆసియా కప్‌లో ఆరు వికెట్ల ఘనత సాధించి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు.

Next Story