Captain Shubman Gill: సొంత ఖర్చులతో న్యూజిలాండ్‌కు నెట్ బౌలర్లు.. టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం!
సంచలన నిర్ణయం!

Captain Shubman Gill: రాబోయే న్యూజిలాండ్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత సారథి శుభ్‌మన్ గిల్, రెడ్ బాల్ క్రికెట్ ప్రాక్టీస్ విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకూడదని నిర్ణయించుకున్నారు. టెస్ట్ మ్యాచ్‌లలో కివీస్ బౌలింగ్ పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు తనతో పాటు 4 నుంచి 5 మంది వ్యక్తిగత నెట్ బౌలర్లను తీసుకెళ్లనున్నారు.
ఖర్చులన్నీ సొంత జేబు నుంచే..
ఈ నిర్ణయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆ బౌలర్ల విమాన టికెట్లు, వీసాలు, హోటల్ బస, ప్రయాణ ఖర్చులను బీసీసీఐ నిధుల నుంచి కాకుండా గిల్ తన సొంత జేబు నుంచే చెల్లించనున్నారు. అక్టోబర్ 23 లేదా 24 తేదీల్లోనే గిల్ న్యూజిలాండ్‌కు బయల్దేరనున్నారు. ఇండియా-ఏ జట్టు తరఫున జరిగే టెస్ట్ మ్యాచ్‌ల్లో గిల్ ఆడటం లేదు. దీనితో అక్కడి పిచ్‌లపై స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు, తన వ్యక్తిగత బౌలర్లతో ఎక్కువ గంటల పాటు కఠినమైన నెట్ సెషన్లలో పాల్గొని బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవాలని ఆయన ప్రణాళిక రచించారు.
వన్డే సిరీస్ బాధ్యతలు.. శ్రేయస్ అయ్యర్‌కు సారథ్యం..
నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి 3 మ్యాచ్‌లకు మాత్రమే శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నారు. ఆ తర్వాత జరిగే చివరి రెండు వన్డేల నుంచి తప్పుకుని, పూర్తిగా టెస్ట్ సిరీస్ రెడ్-బాల్ ప్రాక్టీస్‌పై దృష్టి సారించనున్నారు. గిల్ అందుబాటులో లేని సమయంలో మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నారు.
రంజీ మ్యాచ్‌తో రెడ్-బాల్ సన్నాహాలు
కివీస్ టూర్‌కు వెళ్లే ముందే రెడ్ బాల్‌తో మ్యాచ్ ప్రాక్టీస్ పొందేందుకు గిల్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. పంజాబ్ తరఫున ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆయన ఆడనున్నారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో 754 పరుగులు బాది అద్భుత ఫామ్‌ను కనబరిచిన గిల్.. ఇప్పుడు న్యూజిలాండ్‌లో కూడా కెప్టెన్‌గా, ప్రధాన బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించేందుకు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని చూస్తున్నారు.

