ద్రవిడ్, కుంబ్లే పేర్లతో కొత్త ఎండ్స్ ప్రారంభం!

M. Chinnaswamy Stadium: బెంగళూరులోని ప్రముఖ ఎం. చిన్నస్వామి స్టేడియం సాక్షిగా ఆదివారం ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్ మరియు అనిల్ కుంబ్లే గౌరవార్థం స్టేడియంలోని రెండు వైపులా ఉన్న 'ఎండ్స్' (Ends) కు వారి పేర్లను అధికారికంగా ఖరారు చేశారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ సుజిత్ సోమసుందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరు దిగ్గజాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇల్లు కంటే ఎక్కువే.. భావోద్వేగానికి గురైన ద్రవిడ్

గతంలో 'బి.ఇ.ఎం.ఎల్' (BEML) ఎండ్‌గా పిలిచే భాగానికి ఇప్పుడు 'రాహుల్ ద్రవిడ్ ఎండ్' అని, అలాగే పెవిలియన్ ఎండ్‌కు 'అనిల్ కుంబ్లే ఎండ్' అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. "చిన్నస్వామి స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. మా ఇళ్లలో కంటే ఎక్కువ సమయం ఇక్కడే గడిపాం. ఈ మైదానం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నాకు ఈరోజు ఉన్న పేరు ప్రఖ్యాతులను ఇచ్చాయి. నా పేరుతో ఒక ఎండ్‌ను ఏర్పాటు చేయడం నా కుటుంబానికి, నాకు ఎంతో గర్వకారణం" అని భావోద్వేగంతో చెప్పారు.

హాజరైన కుటుంబ సభ్యులు

ఈ వేడుకలో ద్రవిడ్ తల్లి పుష్ప, తమ్ముడు విజయ్ పాల్గొన్నారు. అలాగే అనిల్ కుంబ్లే భార్య చేతన, కుమారుడు మాయాస్, కుమార్తెలు ఆరుణి, స్వస్థి కూడా ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా చూశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ద్రవిడ్ 24,177 పరుగులు చేయగా, కుంబ్లే 956 వికెట్లు తీశారు. వీరితో పాటు భారత మహిళా మాజీ క్రికెటర్ శాంతా రంగస్వామి పేరు మీద కూడా ఒక స్టాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేఎస్‌సీఏ ఇప్పటికే ప్రకటించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story