British Football History: అంతర్జాతీయ ఫుట్‌బాల్ బదిలీల (ట్రాన్స్‌ఫర్) మార్కెట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ దిగ్గజ క్లబ్ మాంచెస్టర్ సిటీ ఊహించని రీతిలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నాటింగ్‌హామ్ ఫారెస్ట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ ఇలియట్ ఆండర్సన్‌ను రికార్డు బ్రేకింగ్ ధరకు మాంచెస్టర్ సిటీ సొంతం చేసుకుంది. ఈ బదిలీ ఒప్పందం విలువ దాదాపు 116 మిలియన్ పౌండ్లు (సుమారు 155 మిలియన్ డాలర్లు / భారత కరెన్సీలో రూ. 1,260 కోట్లకు పైగా) ఉంటుందని బ్రిటీష్ మీడియా వెల్లడించింది. ఈ మైండ్ బ్లోయింగ్ డీల్‌తో బ్రిటిష్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇలియట్ ఆండర్సన్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

గతంలో రియల్ మాడ్రిడ్ క్లబ్.. జూడ్ బెల్లింగ్‌హామ్ కోసం చెల్లించిన 115 మిలియన్ పౌండ్ల రికార్డును, అలాగే ఆర్సెనల్ క్లబ్ డెక్లాన్ రైస్ కోసం వెచ్చించిన మొత్తాన్ని వెనక్కి నెట్టి ఆండర్సన్ ఇప్పుడు బ్రిటన్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా అవతరించాడు. అదేవిధంగా, మాంచెస్టర్ సిటీ క్లబ్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన బదిలీ కావడం విశేషం. గతంలో 2021లో జాక్ గ్రీలిష్‌ను ఆస్టన్ విల్లా నుండి 100 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసిన రికార్డును ఈ డీల్‌తో సిటీ అధిగమించింది. ఈ అద్భుతమైన మిడ్‌ఫీల్డర్‌ను దక్కించుకోవడానికి మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు పలు అగ్ర శ్రేణి క్లబ్‌లు పోటీ పడినప్పటికీ, చివరికి ఆండర్సన్ మాంచెస్టర్ సిటీ వైపే మొగ్గు చూపాడు.

ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరఫున ఆండర్సన్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ బదిలీకి సంబంధించిన మెడికల్ పరీక్షలను అతను కాన్సాస్‌లోనే పూర్తి చేసుకున్నాడు. వరల్డ్ కప్ టోర్నీ ముగిసి ఇంగ్లాండ్ తిరిగొచ్చిన తర్వాతే ఈ ఐదేళ్ల ఒప్పందానికి సంబంధించిన అధికారిక లాంఛనాలు పూర్తి కానున్నాయని మాంచెస్టర్ సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండు సీజన్లుగా నాటింగ్‌హామ్ ఫారెస్ట్ తరఫున 92 మ్యాచ్‌లు ఆడి రెంట్ లెస్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆండర్సన్ రాకతో, ఇప్పటికే రోడ్రి, ఫిల్ ఫోడెన్ వంటి స్టార్లతో బలంగా ఉన్న మాంచెస్టర్ సిటీ మిడ్‌ఫీల్డ్ మరింత పటిష్టంగా మారనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story