BCCI: 2027 వన్డే వరల్డ్ కప్‌కు ముందు BCCIకి కొత్త సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ టెన్షన్
టెన్షన్

BCCI: వచ్చే ఏడాది జరగనున్న పురుషుల వన్డే వరల్డ్ కప్‌కు ఏడాది కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్షన్ కమిటీలో కొనసాగింపునే కోరుకుంది. అయితే మాజీ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపును కోరుకోకపోవడంతో.. ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు బోర్డు కొత్త వ్యక్తి కోసం చూస్తోంది. కొత్తగా వచ్చే వ్యక్తి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఖాళీగా ఉన్న వెస్ట్ జోన్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకునే గడువు బుధవారం (అక్టోబర్ 14)తో ముగిసింది. అయితే ఇప్పుడు BCCI ముందున్న మరో ఆందోళన కొత్తగా వచ్చే ఛైర్మన్ జట్టుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సెలెక్షన్ కమిటీకి భిన్నమైన ఆలోచనతో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేదే. 2027 వన్డే వరల్డ్ కప్‌కు తక్కువ సమయం మాత్రమే ఉండటంతో.. ఇలాంటి సమయంలో ఆ మార్పు చేయడానికి బోర్డు సిద్ధంగా ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌కు సెలెక్షన్ వ్యవహారాల్లో మరింత కీలక పాత్ర దక్కే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది. అదే జరిగితే.. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రజ్ఞాన్ ఓజా మరికొంత కాలం తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
“వరల్డ్ కప్ వరకు అగార్కర్ కొనసాగితే సెలెక్షన్ కమిటీలో కొనసాగింపు ఉండేదని BCCI భావించింది. కానీ అనుకున్నట్లుగా జరగలేదు” అని ఓ BCCI వర్గాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
“కొత్త సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ వస్తే.. ప్రస్తుతం పనిచేస్తున్న వారి ఆలోచనలకు భిన్నంగా అతడి దృష్టికోణం ఉండే అవకాశం ఉంది. అందుకే కొత్త సెలెక్టర్ ఆలోచనా విధానం ఏంటో బోర్డు అంచనా వేయాల్సి ఉంటుంది. లక్ష్మణ్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించుకునే అవకాశం ఉంది” అని ఆ వర్గం తెలిపింది.
ఖాళీగా ఉన్న సెలెక్టర్ పదవికి మాజీ భారత వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ దరఖాస్తు చేసుకుని.. ఎంపికైతే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే పలు నివేదికల ప్రకారం.. పార్థివ్ పటేల్ ఈ పదవికి దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.
మరోవైపు సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఎస్ఎస్ దాస్ డిసెంబర్లో నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఒక సెలెక్టర్ సెలెక్షన్ కమిటీలో కొనసాగేందుకు అనుమతించే గరిష్ఠ కాలం నాలుగేళ్లే. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఎస్ఎస్ దాస్‌ను కొనసాగించడంపై BCCI పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓజా, ఎస్ఎస్ దాస్‌తో పాటు ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా సెలెక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

