New Zealand: బంగ్లాదేశ్ టూర్ కు న్యూజిలాండ్..వన్డే, టీ20 జట్లు ప్రకటన
వన్డే, టీ20 జట్లు ప్రకటన

New Zealand: బంగ్లాదేశ్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ వన్డే,టీ20 జట్లను అధికారికంగా ప్రకటించింది. రాబోయే ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని, అనుభవం , యువ రక్తం కలయికతో ఈ జట్లను ఎంపిక చేయడం విశేషం. బంగ్లాదేశ్ తో న్యూజిలాండ్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడబోతుంది. ఏప్రిల్ 17న తొలి వన్డే మ్యాచ్ తో సిరీస్ మొదలు కానుండగా మే 2వ తేదీన 3వ టీ20తో ఈ టూర్ ముగుస్తుంది.
ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని స్పిన్ అనుకూల పిచ్‌లను ఎదుర్కోవడానికి కివీస్ బోర్డు పక్కా ప్రణాళికతో కనిపిస్తోంది. వన్డే జట్టులో సీనియర్ ఆటగాళ్లు తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుండగా, టీ20 ఫార్మాట్‌లో మెరుపులు మెరిపించే కుర్రాళ్లకు పెద్దపీట వేశారు. రెగ్యులర్ కెప్టెన్ టామ్ లాథమ్ నేతృత్వంలో స్టార్ ప్లేయర్లు తమ ఫామ్‌ను పరీక్షించుకోనున్నారు. అయితే, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో కొందరు కీలక బౌలర్లకు విశ్రాంతినివ్వగా, దేశవాళీలో రాణించిన స్పిన్నర్లకు ఈ పర్యటనలో చోటు దక్కింది.
బంగ్లాదేశ్ గడ్డపై ఆ జట్టును ఓడించడం ఏ దేశానికైనా సవాలే. స్లో ట్రాక్స్‌పై ముస్తాఫిజుర్ వంటి బౌలర్లను ఎదుర్కోవడం కివీస్ బ్యాటర్లకు అసలైన పరీక్ష. ఈ సిరీస్ కేవలం గెలుపోటముల కోసమే కాదు.. రాబోయే మెగా టోర్నీలకు ముందు బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించుకోవడానికి న్యూజిలాండ్‌కు ఇది ఒక సువర్ణావకాశం. స్పిన్ మాయాజాలాన్ని కివీస్ బ్యాటర్లు ఎలా తట్టుకుంటారు? ఆసియా పరిస్థితుల్లో కివీస్ పేసర్లు ఎంతవరకు ప్రభావం చూపుతారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

