పంత్, జురెల్‌లపై వేటు?

New Zealand ODI Series: అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం వర్చువల్ పద్ధతిలో సమావేశమై న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం టీమిండియాను ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా వికెట్ కీపర్ ఎంపికపై ఆసక్తికర చర్చ జరగనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కెఎల్ రాహుల్‌కు బ్యాకప్ కీపర్‌గా ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకురావాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఆయన 125 పరుగులతో సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చారు. 2026 టీ20 ప్రపంచకప్ జట్టులోనూ చోటు సంపాదించిన కిషన్‌ను, వన్డే ఫార్మాట్‌లోనూ నిలదొక్కుకునేలా తగిన సమయం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. వన్డేల్లో గతంలో కిషన్ డబుల్ సెంచరీ చేసిన రికార్డు కూడా ఆయనకు కలిసొచ్చే అంశం.

స్టార్ కీపర్ రిషభ్ పంత్ ఫామ్ ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్న పంత్, నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక అర్ధసెంచరీ మాత్రమే చేయగలిగారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ తన షాట్ సెలక్షన్‌పై నియంత్రణ కోల్పోతున్నారనే అభిప్రాయం సెలక్టర్లలో ఉంది. మరోవైపు, రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగి వస్తుండటంతో, బ్యాకప్ బ్యాటర్‌గా ఉన్న ధ్రువ్ జురెల్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది.

గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ మళ్ళీ జట్టు పగ్గాలు చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో గిల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే, జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో తగిలిన పొత్తికడుపు గాయం నుండి ఆయన ఇంకా కోలుకోలేదు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుండి ఆయనకు ఇంకా మెడికల్ క్లియరెన్స్ లభించలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story