Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ చూడటం మొదలుపెట్టాను: జోకోవిచ్
క్రికెట్ చూడటం మొదలుపెట్టాను: జోకోవిచ్

Novak Djokovic: టెన్నిస్ ప్రపంచంలో రికార్డుల రారాజు నోవాక్ జోకోవిచ్, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సెర్బియాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా, కోహ్లీ వల్లే తాను ఈ ఆటను అనుసరిస్తున్నానని జోకోవిచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ సందర్భంగా మాట్లాడిన జోకోవిచ్.. కోహ్లీతో తనకున్న బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నిజం చెప్పాలంటే విరాట్ వల్లే నేను క్రికెట్‌ను ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. అంతకుముందు నాకు ఈ ఆట గురించి పెద్దగా తెలియదు. విరాట్ నాకు మంచి స్నేహితుడు, అతని ఆట అన్నా, వ్యక్తిత్వం అన్నా నాకు ఎంతో గౌరవం. మేమిద్దరం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాం" అని జోకోవిచ్ తెలిపారు.
త్వరలోనే భారతదేశాన్ని సందర్శించాలనే తన కోరికను జోకోవిచ్ బయటపెట్టారు. "నేను ఎప్పుడు ఇండియాకు వచ్చినా, విరాట్ నాతో కలవాలని కోరుకుంటున్నాను. మేమిద్దరం కలిసి కాసేపు టెన్నిస్, మరికాసేపు క్రికెట్ ఆడుతూ సరదాగా గడపాలి. క్రీడల ద్వారా ప్రజల్లో మంచి ఉత్సాహాన్ని నింపాలని ఉంది" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా భారత్‌కు రావాలనే పిలుపు తన మనసులో వినిపిస్తోందని, త్వరలోనే అక్కడ ఏదైనా టెన్నిస్ మ్యాచ్ లేదా ఈవెంట్ నిర్వహిస్తానని మాట ఇచ్చారు.
భారతదేశంలో తనకు ఉన్న అభిమానుల పట్ల జోకోవిచ్ కృతజ్ఞతలు తెలిపారు. "భారతీయ టెన్నిస్ మరియు క్రీడా అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. త్వరలోనే మిమ్మల్ని ఇండియాలో కలుస్తాను" అని సందేశం ఇచ్చారు.
ఇక తన ఆట గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత తరం ఆటగాళ్లు అల్కరాజ్, సిన్నర్ మధ్య పోటీ బాగున్నప్పటికీ, తన దృష్టిలో 'బిగ్ త్రీ' (ఫెదరర్, నాదల్, జోకోవిచ్) మధ్య ఉన్న పోరాటమే ఎప్పటికీ అత్యుత్తమమని ధీమా వ్యక్తం చేశారు. 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో దూసుకుపోతున్న జోకోవిచ్, కోహ్లీ మధ్య ఉన్న ఈ డిజిటల్ స్నేహం ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.

