జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి

ODI Series Against New Zealand: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి టీమిండియా కీలక ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించింది. రాబోయే టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా, ఆటగాళ్ల పనిభారాన్ని (Workload Management) తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

భారత జట్టు త్వరలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే, టీ20 ప్రపంచ కప్ సమీపిస్తుండటంతో బుమ్రా, పాండ్యా వంటి ప్రధాన ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం జట్టుకు చాలా ముఖ్యం. అందుకే వారిని కేవలం వన్డే సిరీస్ నుంచే తప్పించి, ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంచాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బుమ్రా 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత ఇప్పటివరకు వన్డేలు ఆడలేదు, అలాగే పాండ్యా కూడా ఫిట్‌నెస్ కారణాల వల్ల వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నారు.

వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్ కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అతని స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఇషాన్ కిషన్ లేదా జితేష్ శర్మకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అతనికి మళ్ళీ జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఈ వన్డే సిరీస్ కోసం భారత జట్టును జనవరి 4 లేదా 5 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది.

అంతర్జాతీయ వన్డేలకు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్ ఆడనున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు దేశవాళీ మ్యాచులు ఆడటం తప్పనిసరి. ఇందులో భాగంగా బరోడా జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీలో పాండ్యా బరిలోకి దిగనున్నారు. జనవరి 3, 6, 8 తేదీల్లో రాజ్‌కోట్‌లో జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో ఆయన ఆడే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ పర్యటన షెడ్యూల్:

వన్డే సిరీస్:

జనవరి 11: మొదటి వన్డే (బరోడా)

జనవరి 14: రెండో వన్డే (రాజ్‌కోట్)

జనవరి 18: మూడో వన్డే (ఇండోర్)

టీ20 సిరీస్:

జనవరి 21 నుండి 31 వరకు: నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువహటి, విశాఖపట్నం, తిరువనంతపురంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story