King Kohli: జులై 14 నుంచి వన్డే సిరీస్.. ఇంగ్లాండ్‌లో కింగ్ కోహ్లి స్పెషల్ ప్లాన్.!
స్పెషల్ ప్లాన్.!

King Kohli: భారత క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కోల్పోయింది. ఇవాళ జరగబోయే ఆఖరి టీ20 మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది.
అయితే, ఈ టీ20ల సంగతి ఎలా ఉన్నా.. జులై 14 నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ సిరీస్ ద్వారా టీమిండియా రథసారధులు.. రన్ మెషీన్ విరాట్ కోహ్లి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఇంగ్లాండ్‌కు చేరుకుని నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
నిజానికి కెరీర్ ఆరంభంలో ఇంగ్లిష్ గడ్డపై విరాట్ కోహ్లికి గొప్ప రికార్డులేమీ లేవు. ముఖ్యంగా 2014 నాటి పర్యటనలో కోహ్లి ఇంగ్లాండ్ పేసర్ల స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ, కింగ్ కోహ్లి అంటేనే పట్టుదల! ఆ పరాభవం నుంచి నేర్చుకుని, రాత్రింబవళ్లు శ్రమించి.. ఆ తర్వాత జరిగిన 2017-18 సీజన్లలో ఇంగ్లాండ్ పిచ్‌లపైనే పరుగుల వరద పారించాడు.
ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్ గడ్డపై తన విశ్వరూపం చూపించడానికి కోహ్లి పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యాడు. టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి విరాట్ ప్రత్యేకంగా సాధన చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఎలా సన్నద్ధమయ్యాడో సంజయ్ బంగర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సంజయ్ బంగర్ మాటల్లో చెప్పాలంటే.. "ఇంగ్లాండ్‌లో ఆడేటప్పుడు రెండు విషయాలను ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి. ఒకటి.. స్వింగును ఎలా కౌంటర్ చేయాలి. రెండు.. బంతిని ఎంత లేటుగా ఆడామనేదే ముఖ్యం. దీని కోసమే విరాట్ గతంలో కూడా ప్రత్యేకమైన పిచ్‌లను సిద్ధం చేయించుకుని మరీ ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు కూడా అదే పట్టుదలతో కఠినంగా శ్రమిస్తున్నాడు."
ఇంగ్లాండ్ బౌలర్ల స్వింగ్ మాయాజాలాన్ని ఎదుర్కొని, వన్డే సిరీస్‌లో కింగ్ కోహ్లి మళ్లీ సెంచరీల వేట మొదలుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి జులై 14 నుంచి ప్రారంభం కాబోయే ఈ వన్డే పోరులో విరాట్ కోహ్లి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి!

