భారత కోచ్‌ పదవిపై జేసన్ గిల్లేస్పీ రియాక్షన్

Jason Gillespie Reacts: భారత టెస్టు జట్టు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. పాకిస్థాన్ మాజీ ప్రధాన కోచ్ జేసన్ గిల్లేస్పీని ఉద్దేశించి ఒక అభిమాని ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా, "జేసన్, మీరు వెంటనే భారత జట్టుకు కోచ్‌గా రావాలి. టీమిండియా కేవలం ఓడిపోవడమే కాదు, స్వదేశంలో రెండుసార్లు వైట్‌వాష్‌కు గురైంది. వారికి మీ సేవలు చాలా అవసరం" అని కోరారు. దీనికి గిల్లేస్పీ అత్యంత క్లుప్తంగా "No thanks" (వద్దు, ధన్యవాదాలు) అని బదులిచ్చి, భారత కోచ్ పదవిపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత టెస్టు జట్టు ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. గత 12 నెలల్లో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. అక్టోబర్ 2024లో న్యూజిలాండ్‌ చేతిలో 0-3తో చారిత్రాత్మక వైట్‌వాష్‌ను ఎదుర్కోవడమే కాకుండా, ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌లోనూ 0-2తో ఓటమి పాలైంది. గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఇప్పటివరకు 19 టెస్టులు ఆడగా.. కేవలం 7 గెలిచి, 10 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత టెస్టు జట్టు పగ్గాలను శుభ్‌మన్ గిల్ అందుకున్నారు. గిల్ కెప్టెన్సీలో భారత్ ఇంగ్లాండ్‌లో 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకోవడం, వెస్టిండీస్‌పై 2-0తో గెలవడం వంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. అయితే, కీలకమైన సౌత్ ఆఫ్రికా సిరీస్ సమయంలో గిల్ గాయపడటంతో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది.ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ రాబోయే మూడు సిరీస్‌లలో కనీసం రెండింటిని గెలవాల్సి ఉంటుంది. టీమిండియా తదుపరి జూలై-ఆగస్టులో శ్రీలంకతో, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో పర్యటించనుంది. అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే కీలక సిరీస్ జట్టు భవిష్యత్తును నిర్ణయించనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story