Online Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ ముందుకు రాబిన్ ఊతప్ప
ఈడీ ముందుకు రాబిన్ ఊతప్ప

Online Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణకు పిలిచారు.మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సోమవారం (సెప్టెంబర్ 22, 2025) ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఊతప్ప ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ అయిన 'మహాదేవ్ బుక్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా భారీగా డబ్బుల లావాదేవీలు, మనీలాండరింగ్ జరిగాయని ఈడీ అధికారులు గుర్తించారు. తప్పతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఈ యాప్‌ను ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి వారు ఎంత మొత్తం తీసుకున్నారు, దాని వెనుక ఉన్న లావాదేవీలు ఏమిటి అనే విషయాలపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. మహాదేవ్ బుక్ బెట్టింగ్ యాప్ కేసులో దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులకు నోటీసులు అందాయి. ఇది మనీలాండరింగ్, అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఒక పెద్ద కేసు. ఇదే కేసులో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, నటులు మిమి చక్రవర్తి, అంకుష్ హజ్రా, సోను సూద్ సహా పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులను ప్రశ్నించారు. యువరాజ్ సింగ్, సోను సూద్ వరుసగా సెప్టెంబర్ 23, 24 తేదీల్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది.2007 టీ20 ప్రపంచ కప్ విజేత జట్టులో యువరాజ్ సింగ్ తో పాటు పాల్గొన్న ఉతప్ప, భారత్ తరపున 13 టీ20లు ఆడాడు, 24.9 సగటుతో 118.01 స్ట్రైక్ రేట్ తో 249 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 205 మ్యాచ్ ల్లో ఆడిన అతను 4,952 పరుగులు సాధించి కోల్ కతా నైట్ రైడర్స్ 2014 ఐపీఎల్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
