Sehwag: ఆసియా కప్‌లో టీమిండియాను గెలిపించేది ఆ ముగ్గురే - సెహ్వాగ్
టీమిండియాను గెలిపించేది ఆ ముగ్గురే - సెహ్వాగ్

Sehwag: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టు విజయావకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చగల ముగ్గురు కీలక ఆటగాళ్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సెహ్వాగ్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ, పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను గేమ్ ఛేంజర్లుగా పేర్కొన్నారు. ‘‘నా అభిప్రాయం ప్రకారం, అభిషేక్ శర్మ ఒక గేమ్ ఛేంజర్ కాగలడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పటికీ గేమ్ ఛేంజరే. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ బౌలింగ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంతో ప్రభావం చూపాడు. వీళ్లు ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లు’’ అని సెహ్వాగ్ వివరించారు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కీలకం
ఇటీవల తరచుగా చర్చకు వస్తున్న 'వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్' అంశంపై కూడా సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బ్యాటర్లతో పోలిస్తే బౌలర్ల విషయంలో వర్క్‌లోడ్ నిర్వహణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ‘‘బ్యాటర్లకు వర్క్‌లోడ్ పెద్ద సమస్య కాదని నేను భావిస్తున్నాను. కానీ బౌలర్లకు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇది చాలా ముఖ్యం’’ అని ఆయన అన్నారు. బౌలర్ల పనిభారాన్ని సరిగ్గా నిర్వహిస్తే వారు ఎక్కువ కాలం ఆడగలరని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో మన ఫాస్ట్ బౌలర్లు అందరూ ఫిట్‌గా అందుబాటులో ఉంటే భారత్ గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయిని ఆయన తెలిపారు.
ఆసియా కప్
ఈసారి ఆసియా కప్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గ్రూప్-ఏలో ఉన్న భారత్ యూఏఈ, పాకిస్థాన్, ఒమన్‌లతో తలపడనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. 14న పాకిస్థాన్‌తో ఒకవైపు 19న ఒమన్‌తో ఆడనుంది.
