Matt Renshaw: ఓపెనింగ్ నాకు అసలు సరిపోదు.. అందుకే ఆ స్థానంలో బ్యాటింగ్ చేయను: మాట్ రెన్‌షా!
మాట్ రెన్‌షా!

Matt Renshaw: ఆస్ట్రేలియా క్రికెటర్ మాట్ రెన్‌షా జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అతను శతకం సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే జట్టును నాథన్ ఎల్లిస్ 5 వికెట్లతో దెబ్బతీయడంతో ఆ జట్టు 235 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 2017 జనవరిలో సిడ్నీ వేదికగా పాకిస్థాన్తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెన్‌షా తన తొలి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వంద పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో నూతనంగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రెన్‌షా తన విజయ రహస్యాన్ని పంచుకున్నాడు. తాను ఒకవేళ ఓపెనర్‌గా బరిలోకి దిగి ఉంటే ఈ సెంచరీ సాధించి ఉండేవాడిని కాదేమో అని తెలిపాడు. ఓపెనింగ్ స్థానంలో తనకు కాస్త ఒత్తిడి ఉంటుందని, కానీ మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడం తనకు సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ, ఫీల్డర్లు లేని చోట షాట్లు ఆడటమే తన బలమని చెప్పాడు.
2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై గ్లెన్ మాక్స్‌వెల్ అజేయంగా 201 పరుగులు చేసిన తర్వాత.. ఆస్ట్రేలియా తరఫున 6వ స్థానంలో లేదా అంతకంటే కింద బ్యాటింగ్ చేసి వన్డే సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రెన్‌షా రికార్డు సృష్టించాడు. త్వరలో దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల ఆస్ట్రేలియా టెస్టు జట్టులో కూడా అతను చోటు దక్కించుకున్నాడు. వన్డేల్లో మిడిలార్డర్‌లో రాణిస్తున్న తాను, టెస్టుల్లో మాత్రం ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సి ఉంటుందని, మైండ్‌సెట్ సరిగ్గా ఉంటే ఏ స్థానంలోనైనా రాణించవచ్చని రెన్‌షా అభిప్రాయపడ్డాడు.

