Pacer Mitchell Starc: బెన్ స్టోక్స్‌ను వదలని స్టార్క్.. అశ్విన్ రికార్డు బద్దలు
అశ్విన్ రికార్డు బద్దలు

Pacer Mitchell Starc: ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం పేసర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను మరోసారి బోల్తా కొట్టించాడు. ఈ సిరీస్‌లో స్టోక్స్‌ను స్టార్క్ అవుట్ చేయడం ఇది ఐదోసారి. ఓవరాల్‌గా టెస్టుల్లో స్టోక్స్‌ను అత్యధిక సార్లు (14 సార్లు) అవుట్ చేసిన బౌలర్‌గా స్టార్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (13 సార్లు) పేరిట ఉండేది. స్టోక్స్‌ను విసిగించడంలో స్టార్క్, అశ్విన్ తర్వాత నాథన్ లియోన్ (10), రవీంద్ర జడేజా (8) ఉన్నారు.
సిడ్నీ టెస్టులో ఇప్పటివరకు రెండు వికెట్లు తీసిన స్టార్క్, తన టెస్ట్ కెరీర్ వికెట్ల సంఖ్యను 430కి చేర్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఎడమచేతి వాటం బౌలర్‌గా నిలవడానికి స్టార్క్ ఇంకా కేవలం నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ (433 వికెట్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ ఆఖరికి స్టార్క్ ఈ రికార్డును అధిగమించే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
మరోవైపు ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ టెస్టుల్లో 41వ సెంచరీని పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ సాధించిన 41 టెస్ట్ సెంచరీల రికార్డును రూట్ ఈ ఇన్నింగ్స్‌తో సమం చేశాడు. ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నేసర్ వేసిన 60వ ఓవర్లో రెండు పరుగులు తీయడం ద్వారా రూట్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ శతకంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్వెస్ కలిస్ (45) తర్వాత రికీ పాంటింగ్‌తో కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు.

