Pacer Mohammed Shami: ఫిట్‌నెస్ నిరూపించుకున్న షమీ.. జట్టులోకి ఎంట్రీ!
జట్టులోకి ఎంట్రీ!

Pacer Mohammed Shami: టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి ఘనంగా పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం షమీని ఎంపిక చేసే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా మోకాలు, చీలమండ గాయాలతో ఇబ్బంది పడుతున్న షమీ, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. తాజాగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. విజయ్ హజారే ట్రోఫీ కేవలం 4 మ్యాచుల్లోనే 8 వికెట్లు తీసి తన మునుపటి లయను అందుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతూ నిలకడగా వికెట్లు తీస్తూ మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. బిసిసిఐ వర్గాల సమాచారం ప్రకారం, షమీని కేవలం ఈ సిరీస్ కోసమే కాకుండా, 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో భాగంగా కూడా పరిగణిస్తున్నారు. అతని అనుభవం జట్టుకు ఎంతో అవసరమని సెలెక్టర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ బౌలర్లకు పనిభారం తగ్గించాల్సి వచ్చినప్పుడు షమీ కీలక పాత్ర పోషించగలడు. షమీ చివరిసారిగా మార్చి 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ తరపున ఆడారు. జనవరి 3 లేదా 4వ తేదీన న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలే జరిగిన ట్రేడింగ్‌లో షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ నుండి లక్నో సూపర్ జెయింట్స్ 10 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. షమీ పునరాగమనం చేస్తే భారత పేస్ దళం మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

