Pacer Umesh Yadav: ‘ఉమేశ్‌ను జట్టు నుంచి తప్పించడమే లక్ష్యం’.. మాజీ కోచ్‌పై టీమిండియా వెటరన్ సంచలన వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు

Pacer Umesh Yadav: టీమిండియా ఎంపికలు అనేవి భారత్‌లో ఎప్పుడూ అందరినీ సంతృప్తిపరచలేవు. క్రికెట్‌కు దేశంలో ఉన్న ఆదరణ, దేశవాళీ క్రికెట్లో ఉన్న పోటీ, ఎన్నో కోచింగ్ సంస్థలు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ఆటగాళ్ల కారణంగా ప్రతిభకు కొదవ లేదు. దాదాపు పదేళ్ల క్రితం వరకు భారత్‌లో టాప్ పేసర్ల కొరత ఉందని చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలాంటి మార్పును చూసిన తరానికి చెందిన పేసర్ ఉమేశ్ యాదవ్.
140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేసిన ఉమేశ్ యాదవ్ భారత్ తరఫున 57 టెస్టులు, 75 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో ఉన్న అతడు అక్టోబర్ 25న 39వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. వయసు పెరిగినా క్రికెట్‌కు మాత్రం దూరం కాలేదు. దేశవాళీ క్రికెట్లో కొనసాగుతున్న ఉమేశ్.. మరోసారి టీమిండియాలోకి రావాలనే ఆశతో ఉన్నాడు.
టీమిండియాలోకి తిరిగి రావడానికి వయసు అడ్డంకి కాకూడదని ఉమేశ్ అభిప్రాయపడ్డాడు. ఎంపిక అనేది ఆటగాడి ప్రదర్శన, ఫిట్నెస్ ఆధారంగా ఉండాలి తప్ప వయసు ఆధారంగా కాదని చెప్పాడు. ఒక ఆటగాడి వయసు 37 లేదా 38 ఏళ్లు ఉండి, పరుగెత్తలేకపోతున్నా, బౌలింగ్ చేయలేకపోతున్నా, వేగం తగ్గినా, ఫీల్డింగ్‌లో ఫిట్‌గా కనిపించకపోయినా నేరుగా చెప్పేయొచ్చని అన్నాడు. ‘‘బ్రదర్.. ఇక నీ వల్ల కాదు. నీ బంతి కూడా మాట్లాడటం లేదు, గతంలోలా వేగంగా బౌలింగ్ చేయడం లేదు, ఫీల్డింగ్‌లోనూ ఫిట్‌గా కనిపించడం లేదు’’ అని స్పష్టంగా చెప్పడం మంచిదని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఉమేశ్ యాదవ్ చివరిసారిగా 2023లో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత గాయాలు, యువ పేసర్ల రాక అతడి అవకాశాలను దెబ్బతీశాయి. ఉమేశ్ కెరీర్ ప్రయాణం కొంతవరకు మహమ్మద్ షమీకి కూడా దగ్గరగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ కూడా భారత్ తరఫున ఆడలేదు. గాయాలు, యువ పేసర్లకు పెరుగుతున్న అవకాశాలు అతడి ఎంపికపై ప్రభావం చూపాయి.
బీసీసీఐ సెలెక్టర్లు ఆటగాళ్లతో మరింత స్పష్టంగా మాట్లాడాలని ఉమేశ్ కోరాడు. సెలెక్టర్‌కు ఏదైనా నిర్ణయం ఉంటే దాన్ని ఆటగాడికి నేరుగా చెప్పాలని సూచించాడు. ఎంపిక చేస్తారో లేదో తెలియకుండా ఆటగాడిని అయోమయంలో ఉంచడం కంటే స్పష్టంగా మాట్లాడటం మంచిదని అన్నాడు. అలా చేస్తే ఆటగాడు తన తర్వాతి అడుగు ఏంటో నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. ‘‘దేశం తరఫున మళ్లీ ఆడాలని ఎవరికి ఉండదు? కమ్‌బ్యాక్ చేయాలని ఎవరికి ఉండదు?’’ అని ఉమేశ్ పేర్కొన్నాడు.
తనకు, షమీకి ఎదురైన గాయాలను కూడా ఉమేశ్ గుర్తు చేసుకున్నాడు. షమీకి అకిలీస్ టెండన్ సమస్య కారణంగా దాదాపు 20 శాతం వరకు గాయం అయిందని, వెనుక భాగంలోని హీల్ బోన్‌కు కూడా కొంత గాయం అయిందని చెప్పాడు. తన విషయంలో గాయం 50 శాతం వరకు ఉందని, టెండన్ పూర్తిగా చీలిపోవడంతో గ్రాఫ్టింగ్ ద్వారా తిరిగి కుట్టాల్సి వచ్చిందని వివరించాడు.
ఆ తర్వాత తాను క్రికెట్లోకి తిరిగి రావడానికి పూర్తి ఏడాది పాటు రిహాబిలిటేషన్ చేయాల్సి వచ్చిందని ఉమేశ్ తెలిపాడు. రిహాబ్ సమయంలో ఒకటి, రెండు చిన్న గాయాలు కూడా తలెత్తుతుంటాయని, వాటి గురించి ముందుగా మనకు తెలియకపోవచ్చని చెప్పాడు. ఇన్ని సమస్యలు ఎదురైనా షమీ తిరిగి వచ్చి ఆడాడని, అయితే అతడికి తన రాష్ట్రం బెంగాల్ నుంచి పూర్తి మద్దతు లభించిందని ఉమేశ్ అన్నాడు. తనకు మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి ఎదురైందని చెప్పాడు.
2026-27 దేశవాళీ సీజన్‌కు ముందు ఉమేశ్ యాదవ్ విదర్భ నుంచి పంజాబ్‌కు మారాడు. 2008లో విదర్భ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్.. దాదాపు 18 ఏళ్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
విదర్భ నుంచి తిరిగి వచ్చిన సమయంలో తనకు అవసరమైన మద్దతు, బ్యాకప్ లభించలేదని ఉమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘అక్కడ ఉమేశ్‌ను పక్కకు తప్పించడంపైనే ఎక్కువ దృష్టి ఉన్నట్లు అనిపించింది. విదర్భ కోచ్ కూడా చాలా సంతోషంగా ఉండేవారు. ‘ఇక ఒక్క సీనియర్ మాత్రమే ఉన్నాడు. అతడిని కూడా బయటకు పంపిస్తే నా మాటే ఎక్కడైనా వినిపిస్తుంది. నేను చెప్పిందే జరుగుతుంది’ అనే ఆలోచన ఉన్నట్లు అనిపించింది. ఆ విషయాలన్నీ జరిగాయి’’ అని ఉమేశ్ వెల్లడించాడు.
అందుకే ఆటగాళ్లకు స్పష్టత చాలా ముఖ్యమని ఉమేశ్ చెప్పాడు. షమీ బాగా ఆడినా సెలెక్ట్ అయినా, కాకపోయినా అతడికి స్పష్టమైన మార్గదర్శకత్వం చాలా ఉపయోగపడుతుందని అన్నాడు. షమీ అయినా, తాను అయినా చిన్నప్పటి నుంచి క్రికెట్‌ను ప్రేమించి ఆడుతున్నామని, తమలో ఇంకా ఎంత క్రికెట్ మిగిలి ఉందో అంతా ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. అయితే భవిష్యత్తుపై స్పష్టత ఉంటే క్రికెట్ ఆడటం మరింత సులభంగా, మెరుగ్గా ఉంటుందని ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు.

