ప్రతి ఆటగాడికి 50 లక్షల రూపాయల జరిమానా

Pakistan Cricket Board Sensation: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీసుకున్న జరిమానా నిర్ణయంపై ఆ దేశ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీ20 ప్రపంచకప్ 2026లో పేలవ ప్రదర్శన చేసినందుకు గాను ప్రతి ఆటగాడికి 50 లక్షల రూపాయల జరిమానా విధించడం అర్థరహితమని ఆయన విమర్శించారు. ఒక వార్తా ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పాక్ క్రికెట్‌లోని లోపాలను ఎండగట్టారు.

"నెలనెలా కోట్లాది రూపాయల జీతాలు తీసుకునే ఆటగాళ్లకు 50 లక్షల జరిమానా విధించడం చాలా తెలివితక్కువ పని. అసలు ఉస్మాన్ తారిక్ వంటి యువ ఆటగాళ్లు ఇంకా 50 లక్షలు సంపాదించనేలేదు, వారు అంత జరిమానా ఎలా కడతారు? ఇందులో అబ్రార్ అహ్మద్, సాహిబ్జాదా ఫర్హాన్ వంటి వారి తప్పేముంది?" అని షెహజాద్ ప్రశ్నించారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మేనేజ్మెంట్ నుంచి కెప్టెన్ వరకు ఎవరెవరు రాజీనామా చేస్తారో చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలు తిండికి ఇబ్బంది పడుతున్న సమయంలో, ప్రదర్శన లేని ఆటగాళ్లకు భారీ జీతాలు ఇవ్వడం తగదని ఆయన సూచించారు. "ప్రస్తుతం ఆటగాళ్లకు నెలకు 46 లక్షల రూపాయల జీతం ఇస్తున్నారు. దానిని వెంటనే 10 లక్షలకు తగ్గించాలి. పీఎస్ఎల్ (PSL) వేలంలో ఇచ్చే కోట్లాది రూపాయలను కూడా నియంత్రించాలి. ప్రదర్శన లేని ఆటగాళ్లకు ఇంత సొమ్ము ఇవ్వాల్సిన అవసరం లేదు" అని బోర్డు ఛైర్మన్‌కు సూచించారు.

ఆటగాళ్లకు ఇచ్చే అదనపు సొమ్మును దేశవాళీ క్రికెట్ పై పెట్టుబడి పెట్టాలని షెహజాద్ కోరారు. అండర్-13, అండర్-16 స్థాయిల నుంచి స్కూల్, యూనివర్సిటీ క్రికెట్ వరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ నిధులను వాడాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుత మేనేజ్మెంట్ మరియు బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు జట్టు ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story