ఐసీసీ జోక్యంతో తగ్గిన పీసీబీ

Asia Cup: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడానికి మ్యాచ్‌ రిఫరీ అండీ పైక్రాఫ్ట్‌ కారణమంటూ పీసీబీ తీవ్రంగా ఆరోపించింది. బుధవారం యూఏఈతో మ్యాచ్‌ జరగడానికి ముందు పాకిస్థాన్‌ టీమ్, పీసీబీ హైడ్రామా సృష్టించాయి.

ఈ షేక్‌హ్యాండ్‌ వివాదానికి పైక్రాఫ్ట్‌దే ప్రధాన బాధ్యత అని ఆరోపిస్తూ ఐసీసీకి పీసీబీ మరో లేఖ రాసింది. పైక్రాఫ్ట్‌ క్షమాపణ చెప్పాలని కూడా ఆ లేఖలో పేర్కొంది. మ్యాచ్‌ మొదలుకావడానికి రెండు గంటల ముందే స్టేడియానికి చేరుకోవాల్సిన పాకిస్థాన్‌ జట్టు, పీసీబీ ఆదేశాల మేరకు హోటల్‌ గదులకే పరిమితమైంది. దీంతో అప్రమత్తమైన రిఫరీ పైక్రాఫ్ట్‌ ఈ విషయాన్ని పీసీబీ ఛైర్మన్‌, ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) హెడ్‌ మోహిసిన్‌ నక్వీతో పాటు ఐసీసీ సీఈఓ సంజోగ్‌ గుప్తా దృష్టికి తీసుకెళ్లాడు.

ఐసీసీ జోక్యంతో తగ్గిన పాకిస్థాన్‌

ఈ వివాదంపై ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఒక కాన్ఫరెన్స్‌ కాల్‌ ఏర్పాటు చేశారు. అందులో రిఫరీ పైక్రాఫ్ట్‌ ఎలాంటి తప్పు చేయలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించారని ఐసీసీ కరాఖండిగా చెప్పింది. ఈ వివాదాన్ని నక్వీ, టోర్నీ డైరెక్టర్‌ అండీ రస్సెల్‌ ముందు ఉంచింది. టోర్నీ నుంచి తప్పుకుంటే 16 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల ప్రైజ్‌మనీని కోల్పోవాల్సి వస్తుందని కూడా పీసీబీకి స్పష్టం చేసింది.

దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పీసీబీ.. మాజీ ఛైర్మన్లు రమీజ్‌ రాజా, నజామ్‌ సేథీతో చర్చించి మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించింది. ఈ కారణంగానే రాత్రి 8 గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే పైక్రాఫ్ట్‌ క్షమాపణ చెప్పిన తర్వాతే తాము మ్యాచ్‌ ఆడేందుకు ఒప్పుకున్నామని పీసీబీ తర్వాత ట్వీట్‌ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story