పాకిస్థాన్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఖరారు.

Pakistan–Bangladesh ODI Series: 2026 టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు కూడా ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. మార్చి 9న బంగ్లాదేశ్‌కు చేరుకోనున్న పాక్ జట్టు, ఒక రోజు ప్రాక్టీస్ తర్వాత మార్చి 11న తొలి వన్డే ఆడనుంది. ఆ తర్వాత మార్చి 13, 15 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి.

గతేడాది జూలైలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన పాకిస్థాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాక్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో ఈసారి వన్డే సిరీస్‌లోనైనా విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని పాక్ భావిస్తోంది. వన్డే సిరీస్‌తో పాటు ఈ ఏడాది చివర్లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ కూడా పాకిస్థాన్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాక్ జట్టు శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉండగా, రేపు (శనివారం) కొలంబోలో న్యూజిలాండ్‌తో కీలకమైన సూపర్-8 మ్యాచ్ ఆడనుంది.

మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించడంతో, బంగ్లాదేశ్ ఈసారి టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరించింది. బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించినప్పటికీ, ఐసీసీ మరియు బంగ్లాదేశ్ అధికారులతో జరిపిన చర్చల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని భారత్‌తో మ్యాచ్ ఆడింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story