Pakistan’s Young Pacer: టెస్టు అరంగేట్రంలో పాకిస్థాన్ యువ పేసర్ చరిత్ర
యువ పేసర్ చరిత్ర

Pakistan’s Young Pacer: పాకిస్థాన్ యువ ఫాస్ట్ బౌలర్ రజాఉల్లా తన టెస్టు అరంగేట్రంలోనే సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతుండగా.. 21 ఏళ్ల రజాఉల్లా తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 63 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండటం విశేషం. దీంతో టెస్టు అరంగేట్రంలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ప్రపంచ రికార్డును రజాఉల్లా సమం చేశాడు. 2008లో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ న్యాపియర్‌లో ఇంగ్లండ్‌పై తన టెస్టు అరంగేట్రంలో 9 సిక్సర్లు బాదగా.. 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఆ రికార్డును ఇప్పుడు రజాఉల్లా సమం చేశాడు.
అంతేకాకుండా టెస్టు అరంగేట్రంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలోనూ రజాఉల్లా ప్రత్యేక స్థానం సంపాదించాడు. అతడు చేసిన 81 పరుగులు ఈ స్థానంలో అరంగేట్ర ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్లలో ఒకటిగా నిలిచాయి. 2024లో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా ఆటగాడు కార్బిన్ బోష్ 81 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. ఇప్పుడు రజాఉల్లా కూడా 81 పరుగులు చేసి అతడి రికార్డును సమం చేశాడు.
320 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్‌కు టాప్ ఆర్డర్‌లో అజాన్ అవైస్, షాన్ మసూద్, బాబర్ ఆజమ్ అర్ధశతకాలతో కొంత ఊరటనిచ్చారు. అయితే 312/7 స్కోరు వద్ద రజాఉల్లా క్రీజులోకి వచ్చినప్పుడు ఇంగ్లండ్ ఆధిక్యంలోనే ఉంది. ఈ దశలో రజాఉల్లా అద్భుతమైన ఎదురుదాడికి దిగాడు. మరో టెయిలెండర్ మహ్మద్ అబ్బాస్‌తో కలిసి దాదాపు రన్-ఎ-బాల్ వేగంతో 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం కారణంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఆధిక్యంలోకి వెళ్లడమే కాకుండా.. ఇంగ్లండ్ ముందు 130 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది. 97వ ఓవర్‌లో డాన్ లారెన్స్ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో రజాఉల్లా ఇన్నింగ్స్ ముగిసింది.
తన అద్భుతమైన బ్యాటింగ్‌పై రజాఉల్లా మాట్లాడుతూ.. తాను ఆడే షాట్లను ముందుగానే ఎంచుకుంటూ బ్యాటింగ్ చేశానని చెప్పాడు. తన ఇన్నింగ్స్‌ను వీలైనంత ఎక్కువసేపు కొనసాగించాలన్నదే ప్రణాళికగా పెట్టుకున్నానని, బౌలర్లు తనకు అనుకూలమైన ప్రాంతాల్లో బంతులు వేయడంతో వాటిని సద్వినియోగం చేసుకున్నానని తెలిపాడు. ఈ క్రమంలో తన రెండు బ్యాట్లు విరిగిపోయాయని చెప్పిన రజాఉల్లా.. దేశం తరఫున ఆడుతున్నప్పుడు భయపడే ప్రశ్నే లేదని, మైదానంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బ్యాటింగ్ చేశానని వెల్లడించాడు. టెస్టు అరంగేట్రంలోనే రికార్డులను సమం చేయడంతో పాటు జట్టును కష్టాల నుంచి బయటపడేసిన రజాఉల్లాపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

