Phil Salt on Opening Partnership with Kohli: మా ఇద్దరి మధ్య అద్భుత సమన్వయం ఉంది.. కోహ్లీతో ఓపెనింగ్‌పై ఫిల్‌సాల్ట్
కోహ్లీతో ఓపెనింగ్‌పై ఫిల్‌సాల్ట్

Phil Salt on Opening Partnership with Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్, ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్‌సాల్ట్ మైదానంలో, ముఖ్యంగా బ్యాటింగ్ సమయంలో విరాట్ కోహ్లీతో తనకున్న బలమైన అనుబంధం గురించి ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు. ఓపెనింగ్ భాగస్వాములకు మంచి అవగాహన ఉండాలని సాల్ట్ నొక్కి చెప్పాడు. "మీరు ఎవరితో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తున్నారో.. వారితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలి. వారు ఎలా ఆడతారో మీకు అర్థం కావాలి, అలాగే వారికి కూడా మీ ఆటపై అవగాహన ఉండాలి" అని పేర్కొన్నాడు. తాను, కోహ్లీ ఇద్దరూ RCb లో కలిసిన మొదటి క్షణం నుంచే ఈ అనుబంధం ఏర్పడిందని ఫిల్‌సాల్ట్ వివరించాడు. "మేమిద్దరం ఎలా ఆడతామనే విషయంలో మా ఇద్దరికీ పరస్పర అవగాహన ఉంది. జైపుర్‌లో లేదా ఢిల్లీలో మేము పెద్దగా మాట్లాడుకోకపోయినా.. చక్కటి సమన్వయంతో ఆడాం. కొన్నిసార్లు షాట్ల గురించి మాట్లాడుకుంటాం, మరి కొన్నిసార్లు ఆ అవసరం రాదు.. సహజంగా జరిగిపోతుంది" అని వారి భాగస్వామ్యం గురించి వివరించాడు.
టీ20 క్రికెట్‌లో కొత్త ట్రెండ్
టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం నడుస్తున్న అటాకింగ్ బ్యాటింగ్ ట్రెండ్‌పై కూడా ఫిల్‌సాల్ట్ మాట్లాడాడు. ఇకపై ఐపీఎల్‌లో బ్యాటర్లు వ్యక్తిగత అవార్డుల కోసం కాకుండా జట్టు విజయం కోసమే ఆడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఫిల్‌సాల్ట్‌ను RCB 2025 సీజన్‌కు ముందు రూ.11.50 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా RCB దాదాపు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నిలిచింది. ఈ విజయంలో విరాట్ కోహ్లీ తన నిలకడైన ప్రదర్శనతో వరుసగా మూడో సీజన్‌లో 600లకు పైగా పరుగులు సాధించి, కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

