Pragyan Ojha: బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ లోకి ప్రజ్ఞాన్ ఎంట్రీ.!
ప్యానెల్ లోకి ప్రజ్ఞాన్ ఎంట్రీ.!

Pragyan Ojha: టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ జోన్ సెలెక్టర్‌గా ఉన్న శ్రీధరన్ శరత్ స్థానంలో ఓజా నియమితులు కానున్నారని ప్రచారం జరుగుతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇటీవల రెండు ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో ఒకటి సౌత్ జోన్ నుంచి కాగా, మరొకటి సెంట్రల్ జోన్ నుంచి ఉండవచ్చని తెలుస్తోంది.
శ్రీధరన్ శరత్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు. ఓజా జాతీయ సెలక్టర్‌గా అర్హత సాధించడానికి అవసరమైన అన్ని ప్రమాణాలను కలిగి ఉన్నారు. దీని ప్రకారం, ఒక వ్యక్తి కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. ఓజా తన కెరీర్‌లో 24 టెస్టులు, 18 వన్డేలు మరియు 6 టీ20లు ఆడాడు. అంతేకాకుండా, ఆట నుంచి రిటైర్ అయి ఐదేళ్లు పూర్తై ఉండాలి. ఓజా 2020లో రిటైర్మెంట్ ప్రకటించారు.
ప్రజ్ఞాన్ ఓజా కెరీర్
భారత క్రికెట్‌లో ఒకప్పుడు కీలక స్పిన్నర్‌గా రాణించిన ప్రజ్ఞాన్ ఓజా, ముంబై ఇండియన్స్‌తో మూడు ఐపీఎల్ టైటిళ్లు కూడా గెలిచాడు. తన కెరీర్‌లో మొత్తం 113 టెస్ట్ వికెట్లు, 21 వన్డే వికెట్లు సాధించాడు. ముఖ్యంగా, సచిన్ టెండూల్కర్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకోవడం ద్వారా ఓజా అభిమానుల మన్ననలను పొందాడు.
