PV Sindhu Gets Hat-trick Chance: పీవీ సింధుకి హ్యాట్రిక్ ఛాన్స్.. వరల్డ్ బ్యాడ్మింటన్ కమిటీలో మూడోసారి స్థానం
వరల్డ్ బ్యాడ్మింటన్ కమిటీలో మూడోసారి స్థానం

PV Sindhu Gets Hat-trick Chance: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. వరల్డ్ బ్యాడ్మింటన్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్‌లో ఆమె మూడోసారి చోటు దక్కించుకుంది. సింధు ఈ పదవిలో 2025 నుంచి 2029 నవంబర్ వరకు కొనసాగనుంది. 2017 నుంచే సింధు ఈ కమిషన్‌లో మెంబర్‌గా ఉంది. అంతేకాదు 2020లో BWF సమగ్రత అంబాసిడర్‌గా కూడా ఆమె వ్యవహరించింది. తాజాగా సింధుతో పాటు మరో నలుగురు స్టార్ ఆటగాళ్లు ఈ కమిషన్‌కు ఎంపికయ్యారు. అన్ సె యంగ్ (కొరియా), దోహా హానీ (ఈజిప్ట్), జియా యి ఫ్యాన్ (చైనా), డెబోరా జిల్లే (నెదర్లాండ్స్) ప్లేయర్స్‌కు కమిషన్‌లో చోటు దక్కింది. వీరెవరికీ పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కమిషన్ ఏం చేస్తుంది?
ఈ అథ్లెట్స్ కమిషన్ అనేది BWF కౌన్సిల్‌కు సలహా ఇచ్చే సంస్థగా పనిచేస్తుంది. ఆటగాళ్లకు సంబంధించిన కీలక అంశాలపై ఈ కమిషన్ సూచనలు చేస్తుంది.
టోర్నమెంట్ల నియమాలు, ఆటగాళ్ల సంక్షేమం, అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఎదురయ్యే సమస్యలపై ఇది సలహాలు ఇస్తుంది. BWF అధ్యక్షుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అథ్లెట్ల నిర్ణయాలే తమకు ముఖ్యమని, ఈ కొత్త సభ్యుల రాకతో బ్యాడ్మింటన్‌ను ప్రపంచంలోనే ప్రముఖ క్రీడగా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం కమిషన్‌లో ఐదుగురు సభ్యులు ఉండగా త్వరలోనే వీరు తమలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఈ కమిటీకి మరో సభ్యుడిని ఎంచుకునే అవకాశం కూడా BWFకి ఉంది.
