Manu Bhaker About Vaibhav Suryavanshi: దేశం గర్వించదగ్గ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్‌కు ఒక వింత అనుభవం ఎదురైంది. షూటింగ్ రేంజ్‌లో లక్ష్యాన్ని గురి తప్పకుండా కొట్టే ఈ స్టార్ ప్లేయర్‌కు.. సంబంధం లేని క్రికెట్ ప్రశ్న ఎదురవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. అసలు ఏం జరిగిందంటే..

ఢిల్లీలో జరిగిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 75వ వార్షికోత్సవ వేడుకల్లో మను భాకర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక విలేకరి ఆమెను అడుగుతూ.. "15 ఏళ్ల యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మీ అభిప్రాయం ఏంటి?" అని ప్రశ్నించారు. ఒక ఒలింపిక్ ఛాంపియన్‌ను, కేవలం హెడ్‌లైన్స్ కోసం మరో క్రీడకు చెందిన ఆటగాడి గురించి అడగడంపై క్రీడాభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

దీనిపై కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. "ఆమె ఒక ఒలింపిక్ పతక విజేత. వైభవ్ గురించి ఆమె అభిప్రాయం అడగడం ఆమెను, ఆమె క్రీడను అవమానించడమే. ఎప్పుడైనా ఒక స్టార్ క్రికెటర్‌ను ఇతర క్రీడల వర్ధమాన క్రీడాకారుల గురించి అడిగే ధైర్యం చేస్తారా?" అంటూ ఆయన ప్రశ్నించారు. కేవలం క్రికెట్‌కే అగ్రతాంబూలం అన్నట్టు వ్యవహరించడం సరికాదని నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు.

అయితే ఈ అనవసరపు ప్రశ్నపై మను భాకర్ ఎంతో పరిణతితో స్పందించారు. ఏమాత్రం అసహనం చెందకుండా.. "ప్రతిభకు వయసుతో సంబంధం లేదు. సరైన మార్గదర్శకత్వం ఉంటే ఎవరైనా రాణిస్తారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడు" అని హుందాగా సమాధానమిచ్చి అందరి మనసులు గెలుచుకున్నారు.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన మను భాకర్.. షూటింగ్‌లోనే కాదు, ఇలాంటి చిక్కు ప్రశ్నలను ఎదుర్కోవడంలో కూడా తనే ఒక ఛాంపియన్ అని నిరూపించుకున్నారు.

Next Story