Quinton de Kock: ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ పంజాబ్ కింగ్స్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో, తుది జట్టులో అవకాశం దక్కించుకున్న డి కాక్ 60 బంతుల్లోనే 112 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును అధిగమించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50 ప్లస్ (అర్థ సెంచరీ లేదా సెంచరీ) పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్‌గా డి కాక్ నిలిచారు. ఇప్పటివరకు ధోనీ 24 సార్లు ఈ ఘనత సాధించగా, డి కాక్ తన తాజా సెంచరీతో 25వ సారి 50 ప్లస్ స్కోరు నమోదు చేసి ధోనీని వెనక్కి నెట్టారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (31 సార్లు) మాత్రమే ఆయన కంటే ముందున్నారు.

అయితే, ఒక అరుదైన రికార్డును మాత్రం డి కాక్ తృటిలో చేజార్చుకున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ల చరిత్రలో ముంబై ఇండియన్స్ తరపున ఒక వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసేందుకు ఆయనకు కేవలం 3 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఆ పాత రికార్డును అధిగమించలేకపోయినా, ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో విరుచుకుపడి ముంబైకి భారీ స్కోరు అందించారు.

కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్ల (ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్) తరపున సెంచరీలు చేసిన అరుదైన ఆటగాళ్ల జాబితాలోనూ డి కాక్ చేరారు. రోహిత్ శర్మ లేని లోటును తన అద్భుత బ్యాటింగ్‌తో భర్తీ చేసిన డి కాక్, ముంబై అభిమానులను ఖుషీ చేశారు. అయితే ఇంతటి భారీ సెంచరీ చేసినప్పటికీ, పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ ధాటికి ముంబై ఓటమిపాలవ్వడం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story